శవం దొరికి 50 ఏండ్లు దాటినా కేసు సాల్వ్ కాలె

శవం దొరికి  50 ఏండ్లు  దాటినా కేసు సాల్వ్ కాలె

మనిషి గడ్డ కట్టుకుపోయేంత చలి ఉండే ఆ మంచు కొండల్లో ఒక కాలిపోయిన మహిళ శవం కనిపించింది. అందులో మిస్టరీ ఏముంది అంటారా? బాడీ దొరకడం పెద్ద మిస్టరీ కాకపోవచ్చు. కానీ.. ఆమె వాడిన కొన్ని వస్తువులు ఈ కేసును మిస్టీరియస్​గా మార్చాయి. ఆమె ఎవరో తెలుసుకునేందుకు కొన్నేండ్లపాటు ఇన్వెస్టిగేషన్​ చేసేలా చేశాయి. ఇంతకీ ఆమె వాడిన వస్తువులేంటి? ఈ కేసును సాల్వ్‌‌ చేయడం ఎందుకు సాధ్యపడలేదు?

నార్వేలోని బెర్గెన్‌‌కు దగ్గర్లోని ఇస్డాలెన్‌‌ (ఇస్డాలెన్​ అంటే ఐస్ వ్యాలీ అని అర్థం) అనే మారుమూల ప్రాంతంలో ఎత్తయిన పైన్ చెట్ల మధ్య పూర్తిగా కాలిపోయిన ఒక మహిళ శవం పడి ఉంది. వెల్లకిలా పడి ఉన్న ఆమె వంటి మీద ఎటువంటి ఆధారాలు దొరక్కుండా ఆమె బట్టలకు ఉన్న లేబుల్స్​ కత్తిరించేశారు. కానీ ఆమె వాడిన వస్తువులు కొన్ని ఆమె శవం దొరికిన ప్రాంతంలో దొరికాయి. కానీ.. వాటిని ఎక్కడ తయారుచేశారు? ఎక్కడ కొన్నదీ తెలియకుండా ఉండేందుకు గుర్తులన్నీ చెరిపేశారు. అందుకే అమె ఎవరనేది తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. ఆ శవం దొరికి ఇప్పటికి యాభై ఏండ్లు దాటింది. చాలామంది రీసెర్చర్లు, కొందరు జర్నలిస్ట్‌‌లు ఆమె ఎవరు? ఎందుకు చంపారు? అనేది తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. ఇంతవరకు అది మాత్రం తెలుసుకోలేకపోయారు.

దొరికింది ఇలా...

ఒక వ్యక్తి, అతని ఇద్దరు కూతుళ్లు ఇస్డాలెన్‌‌లో హైకింగ్ చేస్తున్నప్పుడు నవంబరు 29, 1970న ఒక మహిళ శవాన్ని చూశారు. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్​ ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్​ మొదలుపెట్టారు. ఆమె శరీరం ముందరి భాగం... ముఖ్యంగా ముఖం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. జుట్టు కూడా చాలావరకు కాలిపోయింది. శవం పక్కనే నగలు, లేబుల్స్‌‌తో కూడిన సీసాలు గడియారం, ఒక పర్సు, అగ్గిపెట్టె, ఉంగరం, గొడుగు, చెప్పులు, రబ్బరు బూట్లు, ఉన్ని జంపర్ ఉన్నాయి. ఒక టోపీ కూడా ఉంది. దానిపై పెట్రోల్ జాడలు గుర్తించారు. ఆమె ఎత్తు దాదాపు 5 అడుగులు. గోధుమ రంగు కళ్ళు, పొడవాటి జుట్టు ఉన్నాయి. వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే ఆమె నార్వేకి చెందిన వ్యక్తిలా అనిపించలేదు వాళ్లకి. 

పోస్ట్ మార్టం

పోలీసులు ఆ శవానికి పోస్ట్‌‌మార్టం చేయించారు. ఆ రిపోర్టులో... ఆమె నిద్ర మాత్రలు, కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం వల్ల చనిపోయిందని తెలిసింది. అయితే.. ఆమె శవం చుట్టుపక్కల క్యాంప్​ ఫైర్​ చేసిన ఆనవాళ్లు ఏమీ లేవు. కానీ అన్నవాహికలో మసి ఆనవాళ్లు కనిపించాయి. దాన్ని బట్టి ఆమెను బతికుండగానే కాల్చేశారని చెప్పారు ఎక్స్​పర్ట్స్​. కడుపులో దాదాపు 80 వరకు నిద్రమాత్రలు ఉన్నాయి. ఆమె ఇష్టపూర్వకంగానే వాటిని మింగిందా? లేక బలవంతంగా మింగించారా? అనేది తెలియలేదు. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ.. ఆమె చుట్టూ దొరికిన వస్తువుల వల్ల అది హత్య అని అనుమానించారు పోలీసులు. 

లగేజీ బ్యాగులు 

బెర్గెన్‌‌లోని రైల్వేస్టేషన్ స్టోరేజీ ఫెసిలిటీలో క్లెయిమ్ చేయని రెండు బ్యాగులను పోలీసులు గుర్తించారు. వాటిని పరిశీలిస్తే.. అవి వ్యాలీలో చనిపోయిన మహిళవే అని తెలిసింది. లగేజీ డిపాజిట్​ చేసినప్పుడు ఆమె వేసిన వేలిముద్రల ఆధారంగా ఆ విషయం గుర్తించగలిగారు. ఆ బ్యాగుల్లో గాజులు, ట్యాగ్‌‌లు కత్తిరించిన బట్టలు, విగ్గులు, బెల్జియన్, బ్రిటిష్, స్విస్ నాణేలు, జర్మన్, నార్వేజియన్​ కరెన్సీ నోట్లు, కొన్ని మ్యాప్‌‌లు, రైళ్ల టైం టేబుల్స్​ ఉన్నాయి. అంతేకాదు.. కొన్ని సంఖ్యల వరుసలతో నోట్‌‌ప్యాడ్ మీద ఒక కోడ్​ రాసి ఉంది. అది ఒక జర్నీకి సంబంధించిన సీక్రెట్​ కోడ్. ఆ కోడ్​ను నార్వేజియన్ పోలీసులు డీ కోడ్ చేయిస్తే... ఇస్డాల్​లో మృతి చెందిన ఆమె(ఇస్డాల్​ ఉమెన్​) యూరప్ చుట్టూ చేసిన ప్రయాణాలను ట్రాక్ చేసింది. నార్వేలో ఓస్లో, స్టావాంజర్, బెర్గెన్, యూరప్​లో ప్రధానంగా ప్యారిస్‌‌ ద్వారా చాలాసార్లు ప్రయాణించింది. ఆమె హోటళ్లలో ఉన్న తేదీలు,  స్థలాలు ఆ కోడ్​లో ఉన్నాయి. హోటల్స్​ చెక్-ఇన్ కార్డ్‌‌లు, స్థానిక సాక్షుల వాంగ్మూలాలతో ఆమె ప్రయాణాన్ని క్రాస్ చెక్​ చేశారు. అంతేకాదు.. ఆమెకు ఎనిమిది వేర్వేరు ఐడెంటిటీలు ఉన్నాయి.

రబ్బరు బూట్లు 

రబ్బరు బూట్లను కొన్నప్పుడు షాప్​ వాళ్లు ఇచ్చిన ప్లాస్టిక్​ బ్యాగ్ ఒకటి ఆమె లగేజీ బ్యాగ్​లో దొరికింది. పోలీసులు ఇన్వేస్టిగేషన్​​ చేస్తే​.. అది బెర్గెన్‌‌కు దక్షిణంగా120 మైళ్ల దూరంలో ఉన్న స్టావంజర్ సిటీలోని ఒక ఫుట్​వేర్​ షాప్. వాళ్లను ఎంక్వైరీ చేయగా ఒక మహిళ ఆ రబ్బరు బూట్లు కొన్నట్లు చెప్పారు. ‘‘ఆమె మంచి బట్టలు వేసుకుంది. బాగా మాట్లాడింది. అందంగా ఉంది. బూట్లకు సంబంధించి చాలా ప్రశ్నలు అడిగింది. ఇంగ్లిష్ అంత బాగా మాట్లాడలేకపోయింది”అంటూ చెప్పాడు ఆ షాపు యజమాని కొడుకు. 

గూఢచారి

 ఆ మహిళ స్థానికంగా హోటల్‌‌లో కొన్ని రోజులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడామె తన పేరు ‘‘ఫెనెల్లా లార్చ్”  అని చెప్పింది. కానీ.. అది ఆమె అసలు పేరు కాదు. అంతేకాదు.. మార్చి నుండి నవంబర్ 1970 వరకు నార్వే అంతటా చాలా హోటళ్లలో ఆమె స్టే చేసింది. కానీ.. అన్ని చోట్ల వేర్వేరు పేర్లు చెప్పుకుంది. కొన్ని చోట్ల తాను నవంబర్ 1945లో పుట్టానని, తనది బెల్జియంలోని ఓస్టెండ్‌‌ సిటీ అని చెప్పింది. జెనీవీవ్ లాన్సియర్, క్లాడియా టైల్ట్, క్లాడియా నీల్సన్, అలెక్సియా జార్నే-మెర్చెజ్, వెరా జర్లే, ఎలిసబెత్ లీన్‌‌హౌఫ్ర్.. ఇలా చాలాపేర్లు మార్చింది. అంతేకాదు.. ప్రతి హోటల్‌‌లో ఆమె ఒక నకిలీ పాస్‌‌పోర్ట్‌‌ చూపించింది. వాటిలో ఒక్కటి కూడా దొరకలేదు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఆమె ఒక గూఢచారి అని అందరూ అనుమానించారు. హోటల్స్​లోకి వెళ్లినప్పుడు చాలా ఫ్యాషన్‌‌గా ఉండే బట్టలు వేసుకునేది. ఎక్కువ మాట్లాడేది కాదు. చాలా సీరియస్‌‌గా ఉండేది. జర్మన్, ఫ్లెమిష్ బాగా మాట్లాడేది. జర్మన్ నేవీ సిబ్బంది పక్కన కూర్చుని ఆమె భోజనం చేసినట్టు ఒక వెయిట్రస్  పోలీసుతో చెప్పారు. ఇలాంటి విషయాలన్నీ ఆమె గూఢచారి అని నమ్మడానికి బలాన్ని ఇచ్చాయి. కానీ.. కచ్చితంగా ఆమె ఎవరనేది చెప్పలేకపోయారు. దాంతో నార్వేజియన్ అధికారులు కొద్ది వారాల తర్వాత కేసును క్లోజ్​ చేయాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో ఆమె బంధువులు వస్తే ఇవ్వడానికి శరీర అవశేషాలను జింక్ శవపేటికలో పెట్టి దాచారు.

క్షిపణి వివరాలు 

ఈ మహిళ 1970లో నార్వే చుట్టూ తిరుగుతున్నప్పుడే నార్వేలోని ఓడరేవు నగరాలు, సైనిక స్థావరాల్లో అధునాతన ఆయుధాల రహస్య పరీక్షలు జరిగాయి. పెంగ్విన్ అని పిలవబడే హై క్లాస్​ యాంటీ–షిప్ క్షిపణిని కూడా అదే టైంలో పరీక్షించారు. దీన్ని నీటి ఉపరితలంపై వాడేందుకు తయారుచేశారు. హై సబ్‌‌సోనిక్ వేగంతో లేజర్‌‌లతో డిజైన్​ చేశారు. క్షిపణిని డెవలప్​ చేయడంలో నార్వే సక్సెస్​ అయితే.. అది సైనిక సాంకేతికతలో దేశాన్ని ముందంజలో ఉంచుతుంది. ఆమె జర్నీ చేసిన ప్రాంతాలను ట్రాక్​ చేస్తే.. అవన్నీ ఈ క్షిపణితో ఏదో ఒక విధంగా సంబంధం ఉన్నవే. పైగా ఆమె లగేజీ బ్యాగులో దొరికిన విగ్గులు, మేకప్​ సామాన్లతో తన రూపాన్ని మార్చుకుంది. కాబట్టి క్షిపణి వివరాలు తెలుసుకునేందుకు ఆమెని శత్రు దేశాలే పంపాయని, ఆమె కచ్చితంగా గూఢచారి అని చాలామంది నమ్మారు. కానీ..  ఆమె ఎందుకు చనిపోయింది? ఎవరు చంపారు? ఒక వేళ ఆమె గూఢచారి అయితే ఏ ఇంటెలిజెన్స్ సర్వీస్ కోసం పని చేసింది? అనేవి మాత్రం తెలియలేదు. 

2017లో మళ్లీ తెరపైకి 

ఇంటర్‌‌పోల్​(ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్) 2017లో ఈ కేసు మీద కొత్త నోటీసు ఇచ్చింది. దాంతో ఎన్​ఆర్కే రేడియో నుంచి మారిట్ హిగ్రాఫ్, బీబీసీ నుంచి నీల్ మెక్‌‌కార్తీ బెర్గెన్ పోలీసులతో కలిసి రీ–ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పుడు పండ్ల మీద ఉన్న ఎనామెల్ విశ్లేషణ చేస్తే  ఆమె చిన్నతనంలో ఫ్రాన్స్, జర్మనీ మధ్య సరిహద్దుల్లో పెరిగినట్టు తెలిసింది. పద్నాలుగేండ్ల వయసులో ఆమె జర్మనీ, ఫ్రాన్స్, లగ్జెంబర్గ్, బెల్జియం సరిహద్దు ప్రాంతాల్లో ఉండి ఉండొచ్చని అనుమానించారు. కానీ.. ఇప్పటికీ ఆమెకు సంబంధించిన పూర్తి సమాచారం దొరకలేదు. 

వింత కథనాలు