సూర్య సెంచరీ..శ్రీలంకకు భారీ టార్గెట్

సూర్య సెంచరీ..శ్రీలంకకు భారీ టార్గెట్


టీ20 సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మన్ విజృంభించారు. లంక బౌలర్లను ఉతికారేసిన భారత బ్యాటర్లు..ప్రత్యర్థికి  225 పరుగుల టార్గెట్ను నిర్దేశించారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా ఆరంభంలోనే ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి..గిల్తో కలిసి చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు. సిక్సులు ఫోర్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే 16 బంతుల్లోనే 35 పరుగులు సాధించాడు. అయితే కరుణరత్నే బౌలింగ్లో పెవీలియన్ చేరాడు. అప్పటికే భారత్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులే చేసింది. 

సూర్యకుమార్ సెంచరీ..

త్రిపాఠి నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్..సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. లంక బౌలర్లను ఎడా పెడా బాదిపడేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 46 పరుగులు చేసిన గిల్ ఔటైనా సూర్య తగ్గలేదు. ఆ తర్వాత పాండ్యా, దీపక్ హుడా వరుసగా పెవీలియన్ చేరినా..సూర్య తన జోరును కొనసాగించాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇందులో 9 సిక్సులు, 6 ఫోర్లు ఉండటం విశేషం.

చివర్లో వచ్చిన అక్షర్ పటేల్ 9 బంతుల్లోనే 21 పరుగులు చేయడంతో..భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశనక రెండు వికెట్లు తీసుకోగా..కసున్ రజిత, చమిక కరుణరత్నే, వనిందు హసరంగ తలా ఓ వికెట్ పడగొట్టారు.