చెలరేగిన కుల్దీప్, సిరాజ్..215 పరుగులకే లంక ఆలౌట్

చెలరేగిన కుల్దీప్, సిరాజ్..215 పరుగులకే లంక ఆలౌట్

రెండో వన్డేలో శ్రీలంక 215 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ కు 216 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంక..29 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో కుశాల్ మెండీస్,ఫెర్నాండో  జట్టును ఆదుకున్నారు. ఇదే క్రమంలో ఫెర్నాండో  హాఫ్ సెంచరీ సాధించగా..కుశాల్ మెండీస్ 34 పరుగులు చేశాడు. అయితే ఈ సమయంలో టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. ఓ దశలో ఒక వికెట్ నష్టానికి 102 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న లంకేయులను కుల్దీప్ యాదవ్ దెబ్బకొట్టాడు. కుషాల్ మెండీస్ను LBWగా ఔట్ చేశాడు. ఆ తర్వాత  మరో పరుగు వ్యవధిలో శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. ధనంజయ డి సిల్వను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. 118 పరుగుల వద్ద ఫెర్నాండో రనౌట్ అయ్యాడు. మరికొద్ది సేపటి తర్వాత లంక కెప్టెన్ దసున్ శనకను  కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశాడు. మరో పరుగు వ్యవధిలో కుల్దీప్ మరోసారి మాయ చేసి అసలంకను పెవీలియన్ చేర్చడంతో..శ్రీలంక 24 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక 152 పరుగుల వద్ద లంకను ఉమ్రాన్ మాలిక్ దెబ్బకొట్టాడు. హసరంగను ఔట్ చేయడంతో..లంక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. 

ఈ సమయంలో చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, కసున్ రజిత లంకను ఆదుకున్నారు. ముఖ్యంగా దునిత్ 34 బంతుల్లో 32 పరుగులు చేయగా..కరుణ రత్నే, రజిత 17 పరుగులు చొప్పున  చేసి రాణించారు. చివర్లో మహ్మద్ సిరాజ్ బుల్లెట్ బంతులో లంకేయులను వణికించాడు. 215 పరుగుల వద్ద వెల్లలాగే, లహిరు కుమారను ఔట్ చేయడంతో శ్రీలంక కేవలం 39.4 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు దక్కించుకోగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.