సీఎం కప్‌‌-2023 పోటీలు షురూ

సీఎం కప్‌‌-2023 పోటీలు షురూ
  •   జింఖానా గ్రౌండ్​లో ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

సికింద్రాబాద్, వెలుగు: క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్–2023 పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్​లో  సీఎం కప్ ​పోటీలను మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..  గ్రామ పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వార్డుల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామని, వీటిని సద్వినియోగం చేసుకుని స్థానిక స్టూడెంట్లు, యువత క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్​లు ఎర్రోళ్ల శ్రీనివాస్, క్రిశాంక్, గజ్జెల నగేశ్ పాల్గొన్నారు.

ఆకలితో అలమటించిన క్రీడాకారులు

ఎల్​బీనగర్: రంగారెడ్డి జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలను సరూర్​నగర్ ఇండోర్ స్టేడియంలో ఎల్ బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలెక్టర్ హరీశ్​తో కలిసి ప్రారంభించారు. అయితే క్రీడాకారులకు మధ్యాహ్న భోజనం కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. సాధారణంగా ఎలాంటి క్రీడలు ఏర్పాటు చేసినా క్రీడాకారులకు పోషకాహార భోజనం అందజేస్తారు. కానీ ప్రభుత్వం సీఎం కప్ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో  పాల్గొనే క్రీడాకారులను మధ్యాహ్నం సరిగా ఫుడ్ ​పెట్టలేదు. కొంతమందికే అందజేసి మిగతావారిని వెనక్కి పంపించేశారు. ఉదయం 6 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరామని, ఇక్కడ లంచ్​ పెట్టలేదని చాలా మంది క్రీడాకారులు ఆరోపించారు. ఖాళీ కడుపుతో గేమ్ ​ఎలా ఆడాలని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి మాత్రమే ఓ అన్నం పాకెట్, కొంచెం మజ్జిగ ఇచ్చి పంపించినట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయని తెలిస్తే తమ పిల్లలను తీసుకువచ్చేవాళ్లం కాదని క్రీడాకారుల తల్లిదండ్రులు వాపోయారు.