38 కుటుంబాలకు ఉద్యోగాలు, ఎక్స్‌గ్రేషియా
గతంలో 33 మందికి, తాజాగా ఐదుగురికి ఇచ్చిన ఆర్టీసీ
ఉద్యోగం వద్దన్న శ్రీనివాస్ రెడ్డి భార్య
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమ్మె కాలంలో చనిపోయిన 38 మంది కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు, రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఆర్టీసీ యాజమాన్యం అందజేసింది. సమ్మె కాలంలో కొందరు గుండెపోటుతో చనిపోగా, మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగంతోపాటు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మొదటి విడతగా అర్హులైన 33 మందికి ఉద్యోగాలు, 12 మందికి ఎక్స్‌గ్రేషియా అందజేశారు.
కొందరి విషయంలో టెక్నికల్ సమస్యలుండడంతో వాటిని సరిచేసి వాళ్లకూ ఇచ్చారు. మొత్తంగా 8 మందికి కానిస్టేబుల్, ఇద్దరికి శ్రామిక్‌లు, 12 మందికి కండక్టర్, 16 మందికి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చారు. సమ్మె టైంలో ఆత్మహత్య చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి, ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డి భార్యకు జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇచ్చారు. ఆమె ఉద్యోగం తిరస్కరించిందని, రావాల్సిన డబ్బులు కోరిందని అధికారులు చెప్పారు.

