డేంజర్​లో శ్రీశైలం ప్రాజెక్టు!

డేంజర్​లో శ్రీశైలం ప్రాజెక్టు!

‘వాటర్‌‌ మ్యాన్‌‌’
రాజేంద్రసింగ్‌‌ వార్నింగ్​
సరైన మెయింటెనెన్స్​ లేక డ్యాంకు పగుళ్లొచ్చాయ్​
వెంటనే రిపేర్లు చెయ్యకుంటే భారీ విషాదం తప్పదు

హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని ‘వాటర్​ మ్యాన్​ ఆఫ్​ ఇండియా’ రాజేంద్ర సింగ్​ ఆందోళన వ్యక్తం చేశారు. ‘గంగాజల్‌‌ సాక్షరతా యాత్ర’లో భాగంగా శ్రీశైలం డ్యాం ను సందర్శించిన ఆయన బుధవారం రాజేంద్రనగర్‌‌లోని వాలంతరీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం డ్యాం మెయింటనెన్స్‌‌ సరిగ్గా లేక పగుళ్లు ఏర్పడ్డాయని, అనేక చోట్ల కటాఫ్‌‌లు తనకు కనిపించాయని తెలిపారు.

పైనుంచి భారీ వరదలు పోటెత్తితే ఆనకట్ట తెగే ప్రమాదముందని, అదే జరిగితే శ్రీశైలం కిందున్న అన్ని ప్రాజెక్టుల ఆనకట్టలు కూడా తెగిపోయి ఏపీలోని సగం ప్రాంతం జలసమాధి అయ్యే అవకాశముందని రాజేంద్ర సింగ్​ వార్నింగ్​ ఇచ్చారు. ‘‘ప్రాజెక్టు పరిస్థితిని చూసి నాకు చాలా ఏడుపొచ్చింది. ప్రస్తుత ప్రభుత్వాలు ఎంతో ఖర్చు పెట్టి భారీ ప్రాజెక్టులు కడుతున్నారు. కానీ గతంలో నిర్మించిన ప్రాజెక్టుల మెయింటనెన్స్‌‌ను మాత్రం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి, డ్యాంకు రిపేర్లు, సరైన మెయింటనెన్స్‌‌ చేస్తే ప్రాజెక్టును కలకాలం కాపాడుకోవచ్చు”అని  సూచించారు.

సేవ్​ నల్లమల

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అనుమతులివ్వొద్దని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు రాజేంద్రసింగ్‌‌ విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో నల్లమల రిజర్వ్‌‌ ఫారెస్టులోని ఆదివాసీలను, అక్కడి జేఏసీ నాయకులను కలిశానని, యురేనియం తవ్వకాలపై అక్కడి వారిలో భయం  నెలకొందని, వాళ్లంతా తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. నల్లమలలో యురేనియం వెలికి తీస్తే కృష్ణా బేసిన్‌‌ పూర్తిగా పొల్యూట్​ అవుతుందని, రిజర్వ్‌‌ ఫారెస్ట్‌‌, జంతు, వృక్షజాతులు, ఆదివాసీల జీవనం ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం