
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ… దర్శనాలు
శ్రీశైలం: భూ కైలాసగిరి శ్రీశైల క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనాలు బుధవారం ప్రారంభమయ్యాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకుపైగా సాధారణ భక్తులకు దూరమైన మల్లన్న ఎట్టకేలకు దర్శనమిస్తున్నాడు. కోవిడ్ నిబంధనల మేరకు శ్రీశైల క్షేత్రమంతా శానిటైజ్ చేసి గత రెండు రోజులుగా ట్రయల్ రన్ నిర్వహించిన దేవస్థానం అధికారులు ముందు జాగ్రత్త చర్యలతో భక్తులకు అనుమతిస్తున్నారు. ఆన్ లైన్ తోపాటు బుకింగ్ కౌంటర్లలో ఆధార్ కార్డు ద్వారా టోకెన్లు తీసుకున్న భక్తులు దర్శన ప్రవేశ ద్వారం వద్ద సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ క్యూలో నిలబడుతున్నారు. థర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరిశీలించడంతోపాటు భక్తుల ఆధార్ ధృవపత్రాలు, దర్శనం బుక్ చేసుకున్న రిజిస్ర్టేషన్ పత్రాలను స్కాన్ చేసి సరిపోల్చి చూసిన తర్వాతే ఆలయంలోకి పంపుతున్నారు. ఆలయంలో దర్శనం అనంతరం బయటకు వెళ్లే మార్గంలో కూడా భక్తులు చేతులు శుభ్రం చేసుకునేందుకు వీలుగా కాలితో తొక్కితే నీరు వచ్చే కుళాయిలు, శానిటైజర్లు ఏర్పాటు చేశారు.
క్యూలైన్లలోని పైపులతోపాటు.. మెట్ల మార్గంలోని రైలింగులను కూడా నిర్ణీత సమయాల్లో శానిటైజ్ చేయిస్తున్నారు. క్యూలైన్లలోని భక్తులు సామాజిక దూరం పాటించేందుకు వీలుగా వృత్తాలు మార్కింగ్ చేశారు. ప్రస్తుతానికి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దూర దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. అదే విధంగా తీర్థం, ఉచిత ప్రసాద వితరణ తాత్కాలికంగా నిలిపేశామని దేవస్థానం ఈవో కె.ఎస్ రామారావు వెల్లడించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేవస్థానం మైకుల్లో భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడంతోపాటు.. శ్రీశైల క్షేత్రంలోని ప్రధాన వీధుల్లో కరోనా నివారణపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. సురక్షితంగా స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించడమే లక్ష్యమని ఈవో రామారావు పేర్కొన్నారు.