ట్యాగ్‌‌ టెక్నాలజీతో మస్తు పాలు

ట్యాగ్‌‌ టెక్నాలజీతో మస్తు పాలు

ఆవుల్లో, బర్రెల్లో సంతానాభివృద్ధికి, పాల ఉత్పత్తిని పెంచడానికి  ‘ట్రాపికల్‌‌ బొవిన్‌‌ జెనెటిక్స్’ (టీబీజీ) టెక్నాలజీని అభివృద్ధి చేసినట్టు దేశీయ స్టార్టప్‌‌  ‘ట్రాపికల్‌‌ ఏనిమల్‌‌ జెనెటిక్స్‌‌ (ట్యాగ్‌‌)’ ప్రకటించింది. మేలుజాతి జంతువుల కలయికతో తయారు చేసిన పిండాన్ని జంతువు గర్భసంచిలో ప్రవేశపెడతామని, దీనివల్ల అది గర్భం దాల్చి ఎక్కువ పాలు ఇస్తుందని తెలిపింది. ఇలా ప్రసవించేవాటిని ఎంబ్రో డిరైవ్డ్‌‌ మిల్కింగ్‌‌ (ఈడీఎం) జంతువులు అంటారు. సాధారణ పశువులతో పోలిస్తే ఇవి రెండు రెట్లు ఎక్కువ పాలు ఇస్తాయి. ఈ పాలలో హానికర జన్యువులు ఉండకపోవడం వల్ల సాధారణ పాలతో పోలిస్తే ఇవి ఇంకా మంచివని ట్యాగ్‌‌ తెలిపింది.  గర్భం దాల్చాల్సిన అవసరం లేకుండా కూడా పాలు ఇచ్చేందుకు ‘ప్రెగ్నెన్సీ ఫ్రీ లాక్టేషన్‌‌’ (పీఎఫ్‌‌ఎల్‌‌) టెక్నాలజీని కూడా అందుబాటులోకి తెచ్చినట్టు ట్యాగ్‌‌ తెలిపింది. ఈ విధానంలో ఆవు ఉత్పాదకత కాలాన్ని దాని జీవిత పర్యంతానికి పొడగించవచ్చు. వీధిపశువుల సమస్యను పరిష్కరించేందుకు ఈ విధానం తోడ్పడుతుందని, గోశాలల నిర్వహణను లాభసాటిగా మార్చుకోవచ్చని ట్యాగ్‌‌ కో–ఫౌండర్‌‌ శ్రీనివాస రావు అన్నారు. ‘‘టీబీజీ వల్ల ఆవు ఏడాదికి కనీసం నాలుగువేల లీటర్ల పాలు ఇస్తుంది. అంటే దాదాపు రూ.25 వేల ఆదాయం వస్తుంది. సాధారణ ఆవు ఇచ్చే పాల పరిమాణం 2,500 లీటర్లు మించదు. మా టెక్నాలజీలు ఉపయోగించుకునేవాళ్లు గతంలో పోలిస్తే రెట్టింపు ఆదాయం పొందవచ్చు. మనదేశంలోని ఏడు కోట్ల మంది పాడిరైతులకు టీబీజీ, ప్రెగ్నెన్సీ ఫ్రీ లాక్టేషన్‌‌ టెక్నాలజీలతో ఎన్నో లాభాలు కలుగుతాయి. టీబీజీ విధానాల్లో పిండాలను తయారు చేసేందుకు గుజరాత్‌‌ నగరం ఆనంద్‌‌లో ల్యాబ్‌‌ను నెలకొల్పాం. ఏటా ఇక్కడ లక్ష యూనిట్లను తయారు చేయవచ్చు. నాలెడ్జ్ షేరింగ్‌‌, పరిశోధన అవసరాల కోసం కొన్ని విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం. మాకు ఇప్పటికే ఆరు పేటెంట్లు కూడా ఉన్నాయి. కంపెనీని 2014లో స్థాపించాం’’ అని వివరించారు.