- రాష్ట్ర ప్రభుత్వంలో 9 మంది సలహాదారులు
- రివ్యూలు లేవు.. సూచనలు లేవు.. సెక్రటేరియెట్ వైపే రావట్లే
- అధికారులు సమాచారం ఇవ్వట్లేదంటున్న అడ్వయిజర్లు
- వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ మాత్రమే యాక్టివ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంలో సలహాదారుల పరిస్థితి చూస్తుంటే అసలు అడ్వయిజర్లు ఉన్నట్లా.. లేనట్లా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించి ఏకంగా 9 మంది సలహాదారులను నియమించి, వారందరికీ అత్యున్నతమైన కేబినెట్ ర్యాంకు హోదాను కట్టబెట్టింది. పి. సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ కేశవరావు, ఏపీ జితేందర్ రెడ్డి, ఎన్వీఎస్ రెడ్డి, ఆదిత్యనాథ్ దాస్, మహ్మద్ అలీ షబ్బీర్ తదితరులు ఈ సలహాదారుల లిస్ట్ లో ఉన్నారు.
కేబినెట్ ర్యాంకు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా శాఖాపరమైన రివ్యూస్ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అధికారులు కూడా తమకు ఏం రిపోర్ట్ చేయట్లేదని, కనీసం నిర్ణయాల్లో సంప్రదించడం లేదని స్వయంగా సలహాదారులు వాపోతున్నారు. ఈ తొమ్మిది మందిలో కేవలం వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ రావు మినహా మిగతా అడ్వయిజర్స్ ఎవరూ సెక్రటేరియట్ లో అందుబాటులో ఉండటం లేదు.
అప్పుడప్పుడు షబ్బీర్ అలీ వస్తున్నప్పటికీ శాఖాపరమైన సమీక్షల్లో కనిపించడం లేదు. మిగిలిన వారు మాత్రం ఏ ఉద్దేశం కోసం నియమితులయ్యారో ఆయా సబ్జెక్ట్ ల రివ్యూలలో పాల్గొనడం లేదు. కేశవరావు మాత్రం విద్యా, ఉద్యోగులకు సంబంధించిన ఒకటి రెండు అంశాల్లో పరిమితంగా భాగస్వామ్యం అయ్యారు. దీంతో పాలన, రాజకీయపరమైన భారమంతా ముఖ్యమంత్రి వ్యవహారాల సలహాదారు వేం నరేందర్ రెడ్డిపైనే పడింది. దీంతో పొలిటికల్, అధికార యంత్రాంగం అంతా ఆయన దగ్గరికే క్యూ కడుతోంది.
పదవులున్నా.. పాత్ర శూన్యం
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వివిధ సామాజిక, పరిపాలనా వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కీలకమైన పోస్టుల్లో ఈ సలహాదారులను నియమించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల సలహాదారుగా సీనియర్ నేత షబ్బీర్ అలీకి బాధ్యతలు అప్పగించినా, ఆయన ఆయా శాఖల సమీక్షల్లో పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు సెక్రటేరియేట్‌కు వస్తున్నారు.
అలాగే వ్యవసాయ రంగంలో అపార అనుభవం ఉందని పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ సలహాదారు పోస్టు ఇచ్చినా క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం శూన్యం. క్రీడా వ్యవహారాల కోసం జితేందర్ రెడ్డిని, ప్రభుత్వ ఫ్లాగ్షిప్ సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ కోసం పి. సుదర్శన్ రెడ్డిని నియమించినా వారి పాత్ర నామమాత్రంగానే మిగిలిపోయింది.
నీటిపారుదల శాఖ లాంటి కీలక విభాగానికి ఆదిత్యనాథ్ దాస్ ఉండగా ఆయన విషయంలో తెలంగాణ అధికారులకు పొంతన కుదరడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పట్టణ రవాణా విభాగానికి రిటైర్డ్ ఐఆర్ఏఎస్ అధికారి ఎన్వీఎస్ రెడ్డిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు. ఆయన మెట్రోను ప్రభుత్వపరం చేసే టాస్క్‌లో అంతంత మాత్రంగానే పాలుపంచుకుంటున్నారని తెలుస్తోంది. మెట్రో 2 విస్తరణపై కూడా సెంట్రల్ నుంచి పర్మిషన్ తీసుకురావడంలో విఫలమవుతున్నారు. మరోవైపు అడ్వయిజర్లలో కొందరికి చాంబర్లు కూడా లేకపోవడం గమనార్హం.
అధికారులపై అడ్వయిజర్ల అసంతృప్తి
సలహాదారుల పనితీరుపై ఒకవైపు ఆరోపణలు వస్తుంటే.. మరోవైపు అడ్వయిజర్లు ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమను కేబినెట్ హోదాలో నియమించినప్పటికీ, సెక్రటేరియట్ లోని ఐఏఎస్ అధికారులు కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని వారు అంతర్గతంగా వాపోతున్నారు. తమ శాఖలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో గానీ, పాలనాపరమైన మార్పులు చేసేటప్పుడు గానీ అధికారులు తమకు సమాచారం ఇవ్వడంలేదని మండిపడుతున్నారు.
కనీసం సమీక్షా సమావేశాలకు తమను ఆహ్వానించకపోవడం, ఆయా శాఖల పురోగతిపై ప్రోగ్రెస్ రిపోర్ట్స్ పంపకపోవడం పట్ల గుర్రుగా ఉన్నారు. మంత్రులు సైతం తమను కలుపుకొని పోయేందుకు ఆసక్తి చూపకపోవడం ఈ అడ్వయిజర్ల అసహనానికి మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది.
వేం నరేందర్ రెడ్డి చాంబర్‌కు క్యూ
సీఎం వ్యవహారాల సలహాదారు వేం నరేందర్ రెడ్డి అత్యంత కీలకంగా మారారు. మిగతా వారు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ, రాజకీయ పరమైన భారమంతా అనివార్యంగా ఆయన భుజాలపైనే పడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పొలిటికల్ నాయకులతో పాటు అధికార యంత్రాంగం అంతా ఏదైనా పని ఉంటే నేరుగా ఆయన దగ్గరికే క్యూ కడుతున్నారు.
సీఎంఓ సెక్రటరీల దగ్గర నుంచి ఇతర సీనియర్ ఆఫీసర్ల దాకా అందరూ ఆయన చాంబర్ దగ్గరే అర్జీలు పెడుతున్నారు. ఆయనకు తోడుగా ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు చురుగ్గా ఉంటున్నారు. ఇప్పటికైనా సలహాదారులకు, అధికారులకు మధ్య సమన్వయం పెంచేలా చర్యలు తీసుకోకపోతే ఈ పదవులు కేవలం అలంకారప్రాయంగానే మిగిలిపోయే ప్రమాదం ఉందనే చర్చ సెక్రటేరియెట్ వర్గాల్లో నడుస్తోంది.
