V6 News

పట్నం జనానికి పానీ కష్టాలు.. అరగంటకు మించి నల్లా నీరు రావట్లే.. ఒక్కొక్కరికి 30 లీటర్లే !

పట్నం జనానికి పానీ కష్టాలు.. అరగంటకు మించి నల్లా నీరు రావట్లే.. ఒక్కొక్కరికి 30 లీటర్లే !
  • ‘మిషన్​ భగీరథ’ పేరుతో వేల కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం 
  • నేటికీ పూర్తిస్థాయిలో నీళ్లు రాక పరేషాన్​..
  • మిషన్ భగీరథ అర్బన్ స్కీమ్ పై రాష్ట్ర సర్కార్​ ఫోకస్ 
  • పెండింగ్​ పనులకు రూ.500 కోట్లు అవసరమని ఆఫీసర్ల ప్రతిపాదనలు
  • త్వరలో నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అర్బన్​ ఏరియాల్లో నివసిస్తున్న ఒక్కో మనిషికి రోజుకు కేవలం 30 లీటర్లకు మించి నీళ్లు అందడం లేదు. మిషన్ భగరీథ స్కీమ్ ద్వారా మున్సిపాలిటీల్లో నివసించే ఒక్కొక్కరికి 135 లీటర్లు, కార్పొరేషన్లలో 150 లీటర్ల చొప్పున అందిస్తామని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రజల రోజువారీ నీటి అవసరాలు తీర్చే పేరుతో వేల కోట్లు ఖర్చు చేసింది.

కానీ, నేటికీ అర్బన్ ఏరియాల్లో పూర్తిస్థాయిలో నీళ్లు అందడంలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అర్బన్​ మిషన్ భగీరథ స్కీమ్ పై ఫోకస్ పెట్టింది. ఇందుకు పెండింగ్ ​పనులను పూర్తి చేయడానికి రూ.500 కోట్లు అవసరమని ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపించారు. 2026–27 బడ్జెట్​లో పెట్టి ఈ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నది.

ఒక్కొక్కరికి 100 లీటర్లు లక్ష్యం..

గత  బీఆర్ఎస్​ ప్రభుత్వం చేయకుండా వదిలేసిన మిషన్​ భగీరథ పనులను కంప్లీట్ చేయడానికి రేవంత్ సర్కారు దృష్టి సారించింది. అర్బన్ ఏరియాలో ఒక్కొక్కరికి కనీసం 100 లీటర్ల నీటిని అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నది. మిషన్​ భగీరథ పెండింగ్​ పనుల వివరాలను మున్సిపల్​శాఖ ఆఫీసర్ల నుంచి తెప్పించుకుని, పలు దఫాలుగా రివ్యూ మీటింగ్​లు నిర్వహించారు.

‘గోదావరి, కృష్ణా నదుల నుంచి వాటర్ ట్రీట్‌‌‌‌మెంట్ ప్లాంట్లు, పంపింగ్ సిస్టమ్, మెయిన్ ట్రాన్స్‌‌‌‌మిషన్ పైప్‌‌‌‌లైన్లు ద్వారా ఓవర్‌‌‌‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల వరకు నీటిని తీసుకెళ్లే పనుల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిచేయడం..  ఇంట్రా-మున్సిపల్ వర్క్​లలో భాగంగా ఓవర్‌‌‌‌ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ల నుంచి  డిస్ట్రిబ్యూషన్ పైప్‌‌‌‌లైన్లు, ఇంటింటికీ నల్లా నీటిని అందించే పెండింగ్ పనులు కంప్లీట్ చేయడం’ వంటి వాటిపై అధికారుల నుంచి రిపోర్ట్​ తీసుకున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో మిషన్​ భగీరథ పెండింగ్​ పనులు కంప్లీట్​ చేయడానికి మున్సిపల్ శాఖ ఆఫీసర్లు రూ.500 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2026–27 బడ్జెట్​లో ఈ నిధులకు ఆమోదం తెలిపింది. త్వరలోనే ప్రభుత్వం ఈ నిధులు రిలీజ్​ చేయనున్నదని మున్సిపల్​ శాఖ ఆఫీసర్లు తెలిపారు.  

అరగంటకు మించి నల్లా నీరు రావట్లే!

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ స్కీమ్ చేపట్టింది. కృష్ణా నది నుంచి 32.43 టీఎంసీలు, గోదావరి నది నుంచి 53.68 టీఎంసీల నీటిని తీసుకొచ్చి గ్రామాలు, పట్టణాల్లో అందిస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆధారంగానే రూ.30 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసింది. అర్బన్​ ఏరియాలో నలుగురు సభ్యులు ఉన్న ఒక కుటుంబానికి రోజుకు కనీసం 500 లీటర్లకు మించి నీటిని నల్లాల ద్వారా సరఫరా చేస్తామని ప్రకటించింది. ఈ నీటిని తాగడానికి, వంట చేయడానికి, స్నానానికి, ఇతర గృహ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

పట్టణాల్లో పనులు పూర్తి చేయకుండానే మధ్యలో వదిలేసింది. ఇంటింటికీ నల్లాలు బిగించలేదు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మొత్తంలో వాటర్​ సప్లై చేసే ప్రధాన ట్రాన్స్‌‌‌‌మిషన్ పైప్‌‌‌‌లైన్లు, వాటర్ ట్రీట్‌‌‌‌మెంట్ ప్లాంట్లు నిర్మించారు. రూరల్ ఏరియాలో గ్రామ పంచాయతీలలో ఇంటింటికీ నల్లా  కనెక్షన్లు దాదాపు 100% సాధించినట్టు అధికారికంగా ప్రకటించారు.

కానీ, అర్బన్ ఏరియాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంట్రా డిస్ట్రిబ్యూషన్ పనులు, అంతర్గత పైప్‌‌‌‌లైన్లు, సంప్​లు, ఓవర్‌‌‌‌హెడ్ ట్యాంకులు నిర్మించకుండా.. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వకుండానే వదిలేశారు. దీంతో అర్బన్​ ఏరియాలో ఒక్కో వ్యక్తికి రోజుకు 30 లీటర్లకు మించి వాటర్​ సప్లయ్​ కావడం లేదని నగర ప్రజలు చెబుతున్నారు. కొన్ని ఏరియాల్లో పావు గంట, అరగంటకు మించి నల్లాలు రావట్లేదని అంటున్నారు.