సర్కారు బడుల్లో పది శాతం అడ్మిషన్లు పెంచాల్సిందే..నేటి (మే 14) నుంచి ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బడి బాట

సర్కారు బడుల్లో పది శాతం అడ్మిషన్లు పెంచాల్సిందే..నేటి (మే 14) నుంచి ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బడి బాట
  • సర్కారు బడుల్లో పది శాతం అడ్మిషన్లు పెంచాల్సిందే..
  • నేటి నుంచి ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బడి బాట

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని- 2026-–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడి బాటకు శ్రీకారం చుట్టింది.  గురువారం నుంచి జూన్19 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అడ్మిషన్ల జాతర కొనసాగనుంది. ఈసారి కేవలం అడ్మిషన్లే కాకుండా, గతేడాది కంటే ప్రతి స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనీసం 10 శాతం అదనపు నమోదును సాధించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఆయా స్కూళ్ల టీచర్లదే బాధ్యత అని ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో 2025లో ఎన్ని అడ్మిషన్లు ఉన్నాయి.. పది శాతం పెంచితే ఎన్ని అడ్మిషన్లు అవుతాయనే వివరాలనూ డీఈఓలకు డైరెక్టరేట్ నుంచి పంపించారు. ఈ మేరకు డీఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులిచ్చారు. బడి బాటలో భాగంగా హెడ్మాస్టర్లు, టీచర్లు, విద్యా కమిటీలు ప్రతి ఇంటిని తిరిగి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీల్లో ఐదేండ్లు నిండిన పిల్లలను గుర్తించి నేరుగా సర్కారు బడుల్లో చేర్పించనున్నారు.

మధ్యలో చదువు ఆపేసిన పిల్లలను గుర్తించి వారిని మళ్లీ బడి బాట పట్టించడంపై ఫోకస్ పెట్టారు. ఈ ప్రక్రియలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను భాగస్వామ్యం చేయనున్నారు. ప్రభుత్వ బడుల్లో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించడమే ఈ డ్రైవ్ ఉద్దేశమని అధికారులు చెప్తున్నారు. 

ఏఐ పాఠాలు.. కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ధీటుగా..

సర్కారు బడులు ఇప్పుడు హైటెక్ హంగులు అద్దుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, డిజిటల్ క్లాస్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల గురించి పేరెంట్స్ కు వివరించాలని ఉపాధ్యాయులను అధికారులు ఆదేశించారు. వీటితో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, పాలు, రాగిజావతో కూడిన బ్రేక్ ఫాస్ట్ స్కీము వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. హైస్కూల్ స్టూడెంట్లకే ఐఐఐటీ, నీట్, జేఈఈ, క్లాట్ తదితర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వడం గురించి పేరెంట్స్ కు వివరించాలని అధికారులు ఆదేశాలిచ్చారు. జూన్ 10 లోపు స్కూళ్లలో పెయింటింగ్స్, క్లీనింగ్ పనులు పూర్తి చేసి, పండుగ వాతావరణంలో విద్యార్థులకు వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్ చెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

పర్యవేక్షణకు బడి బాట డెస్క్..

ప్రతి రోజూ నమోదైన పిల్లల వివరాలను ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పొందుపరిచేలా జిల్లాల వారీగా ప్రత్యేక బడి బాట డెస్క్ లను ఏర్పాటు చేశారు. రోజువారీగా సేకరించిన డేటాను గూగుల్ స్ప్రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షీట్ ద్వారా రాష్ట్ర స్థాయికి పంపాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి, అత్యుత్తమ ఫలితాలు సాధించిన టాప్-3 జిల్లాలు, అత్యధిక నమోదు ఉన్న 10 పాఠశాలలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి సత్కరించనుంది.