మళ్లా పెరిగిన బస్సు కిరాయి

మళ్లా పెరిగిన బస్సు కిరాయి
  • సర్వీస్​, ప్రయాణ దూరాన్ని బట్టి డీజిల్​ సెస్​ పేరిట బాదుడు
  • ఒక్కో స్టేజీకి సగటున రూ.5 దాకా భారం
  • పల్లె వెలుగులో 250 కి.మీ. ప్రయాణిస్తే రూ.5 నుంచి రూ.45 వసూలు
  • ఎక్స్​ప్రెస్​లో 500 కి.మీ.కు రూ.5 నుంచి రూ.90 
  • ఏసీ బస్సుల్లో 500 కి.మీ.కు రూ.10 నుంచి రూ.170
  • ఇయ్యాల్టి నుంచే అమల్లోకి జీహెచ్ఎంసీ మినహా అన్ని ప్రాంతాల్లో వర్తింపు

హైదరాబాద్, వెలుగు:బస్సు ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల మోత మోగిస్తోంది. రెండోసారి డీజిల్ సెస్​ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ సెస్ చార్జీలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. పెరిగిన సెస్​ జీహెచ్ఎంసీ మినహా అన్ని ప్రాంతాల్లో వర్తిస్తుందని పేర్కొంది. ప‌‌‌‌ల్లె వెలుగు సర్వీస్​కు 250 కిలో మీటర్ల వరకు రూ.5 నుంచి రూ.45 వరకు వసూలు చేయనున్నారు. అదే విధంగా ఎక్స్ ప్రెస్‌‌‌‌ సర్వీస్​కు 500 కిలో మీటర్ల వరకు రూ.5 నుంచి రూ.90, డీల‌‌‌‌క్స్‌‌‌‌కు రూ.5 నుంచి రూ.125, సూప‌‌‌‌ర్ ల‌‌‌‌గ్జరీకు రూ.10 నుంచి రూ.130,  ఏసీ స‌‌‌‌ర్వీసులు రూ.10 నుంచి రూ.170 పెంచారు. ఒక్కో స్టేజ్​కు యావరేజ్​గా రూ.5 చొప్పున పెంచినట్లు తెలుస్తున్నది. అలాగే బస్ పాస్ చార్జీలు కూడా రెండో సారి పెంచారు. వీటిని 75 శాతం దాకా పెంచినట్లు తెలుస్తున్నది. నష్టాల్లో ఉన్న సంస్థపై పెరిగిన డీజిల్‌‌‌‌ ధర ఆర్థిక భారాన్ని మరింత పెంచిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎం.డీ సజ్జనార్​ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

దీంతో ప్రస్తుతం ప్రతిరోజు దాదాపు రూ.5 కోట్ల నష్టం వస్తోందన్నారు. తొలుత ఏప్రిల్ 09 నుంచి అమల్లోకి వచ్చే విధంగా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీస్‌లలో ప్రతి ప్రయాణికుడికి రూ.2- డీజిల్ సెస్ విధించినట్లు చెప్పారు. ప్రయాణించిన దూరంతో సంబంధం లేకుండా ఇతర అన్ని సర్వీసుల్లో ప్రతి ప్రయాణికుడికి రూ.5 విధించామన్నారు. అయినా నష్టాలు తగ్గకపోవడంతో మరోసారి డిజీల్​ సెస్​ను పెంచినట్లు వివరించారు. బస్సులను నడపడానికి సంస్థ ప్రతి రోజు దాదాపు 6 లక్షల లీటర్ల డీజిల్‌ను వాడుతున్నదని చెప్పారు.

      రకం                                   అదన‌పు డీజిల్ సెస్    
ప‌ల్లెవెలుగు                       రూ.5 నుంచి రూ.45  (250 కి.మీ వరకు)
ఎక్స్ ప్రెస్‌                         రూ.5 నుంచి రూ.90  (500 కి.మీ వరకు)
డీల‌క్స్‌                              రూ.5 నుంచి రూ.125  (500 కి.మీ వరకు)
సూప‌ర్ ల‌గ్జరీ                    రూ.10 నుంచి రూ.130  (500 కి.మీ వరకు)
ఏసీ స‌ర్వీసులు                రూ.10 నుంచి రూ.170  (500 కి.మీ వరకు)

రెండు నెలల్లో భారీగా పెంపు
ఆర్టీసీ వివిధ రకాల పేర్లతో టికెట్‌ చార్జీలు పెంచుకుంటూ పోతోంది. రెండు నెలల్లోనే టికెట్​ధరలు భారీగా పెంచింది.  ఇప్పుడు డీజిల్‌ రేట్ల పెంపు కారణం చూపుతూ ప్రజలపై భారం మోపుతోంది. మొదట పల్లెవెలుగు బస్సుల్లో రౌండ్‌ ఫిగర్‌ పేరుతో షురూ చేసింది. ఆ తర్వాత సేఫ్టీ సెస్‌ అని పెంచేసింది. బస్సు ప్రమాదాల్లో చనిపోయేవారికి చెల్లించే పరిహారానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఉండనందున.. ఇప్పుడు ఆ మొత్తాన్ని జనం నుంచే రాబట్టాలని సేఫ్టీ సెస్‌ను తీసుకొచ్చింది. టికెట్‌పై రూపాయి సెస్‌ విధించింది. దానికి మళ్లీ రౌండ్‌ ఫిగర్‌ యాడ్‌ చేశారు. ఆ వెంటనే వివిధ రకాల బస్‌పాస్‌ ధరలపై భారీగా వడ్డించింది. ఇప్పుడూ మళ్లీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.