మండలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

మండలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

రాస్తారోకోలు...రిలే నిరాహార దీక్షలు
రాజీనామాలు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి

నెట్​వర్క్​, వెలుగు : రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటుకు సర్కారు గ్రీన్​సిగ్నల్ ఇవ్వడంతో మరిన్ని మండలాల ఏర్పాటు డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. శనివారం సీఎం సోమేష్​కుమార్​ కొత్త మండలాల ఏర్పాటుకు ప్రైమరీ నోటిఫికేషన్ రిలీజ్​చేసిన విషయం తెలిసిందే. వీటిపై 15 రోజులపాటు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు అభ్యంతరాలు, వినతులను స్వీకరించనున్నారు. కాగా, సర్కారు ప్రకటించిన కొత్త మండలాల్లో మునుగోడు నియోజకవర్గంలో గట్టుప్పల్  కూడా ఉంది.  చాలా ఏండ్లుగా ఈ మండలం ఏర్పాటుకు డిమాండ్​ఉన్నప్పటికీ అది కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం కావడంతో టీఆర్ఎస్​ ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. కాగా, రాజగోపాల్​రెడ్డి త్వరలో బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ బై ఎలక్షన్​ జరిగితే లబ్ధి పొందాలనే ఆలోచనతోనే గట్టుప్పల్​తో పాటు రెండేళ్లుగా హామీల దశలో ఉన్న మరో 12 మండలాల ఏర్పాటుకు సర్కారు నోటిఫికేషన్​ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఇదే అదనుగా పలు కొత్త మండలాల డిమాండ్లు కూడా పబ్లిక్​, ప్రతిపక్షాలు తెరపైకి తెస్తుండడంలో సర్కారు ఎలాస్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

సంగారెడ్డి జిల్లా తడ్కల్ లో దీక్షలు
ఎన్నికల టైంలో ఇచ్చిన మాట ప్రకారం కంగ్టి మండలం తడ్కల్ గ్రామ పంచాయతీని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు నిరవధిక నిరసన దీక్షలకు దిగారు. ఆదివారం స్వచ్ఛందంగా బంద్ పాటించి సోమవారం నుంచి రిలే దీక్షలకు కూర్చున్నారు. మండల ఏర్పాటు కోసం సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ రాజీనామా చేయాలని స్థానికులు ఒత్తిడి చేస్తున్నారు.  

జగిత్యాల జిల్లాలోనూ... 
జగిత్యాల జిల్లా మెడిపల్లి మండలంలోని మన్నెగూడెంను మండలంగా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు, మన్నెగూడెం సర్పంచ్ నరేశ్​రెడ్డి, ఎంపీటీసీ చెన్నమనేని రవీందర్ రావు, గ్రామస్తులు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కు ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. మన్నెగూడెంకు అర్హత ఉన్నా భీమారం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటనలు చేయడం కరెక్ట్​కాదన్నారు.  

ఇనుగుర్తి బంద్ 
మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలని మండల సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం బంద్​నిర్వహించారు. రోడ్డుపై వంటవార్పు నిర్వహించారు. దీంతో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎంపీలు కవిత, వద్దిరాజు రవిచంద్ర, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్  సీఎం కేసీఆర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారని, దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు.  

మూడు మండలాలు కావాలె..
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేటను మండల కేంద్రంగా గుర్తించాలని గ్రామంలోని అంబేద్కర్ సెంటర్ లో సోమవారం మండల సాధన సమితి నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. లక్ష్మీదేవి పేట మండల కేంద్రానికి అనువైన గ్రామమని, జనాభా, రెవెన్యూ పరంగా అన్ని అనుకూలతలు ఉన్నాయంటున్నారు. ములుగు జిల్లాలో ఉన్న 9 మండలాలతో పాటు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట, ములుగు మండలంలోని మల్లంపల్లి, మంగపేట మండలంలోని రాజుపేట గ్రామాలను మండలాలుగా గుర్తించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్​చేస్తున్నారు.  

సొనాలను మండలం చేయాలని రాస్తారోకో 
ఆదిలాబాద్​జిల్లా బోథ్​మండలంలోని సొనాలను మండలం చేయాలని సొనాల చుట్టు పక్క గ్రామాల ప్రజలు సోమవారం అంతర్రాష్ర్ట రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎన్నికల టైంలో జిల్లాకు వచ్చిన సీఎం సొనాలను, సాత్నాలను మండలాలుగా చేస్తానని హామీ ఇచ్చారని, కానీ ఆ మాట నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంటనే రావాలని డిమాండ్​ చేశారు. మండలం చేయకపోతే మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  అలాగే వనపర్తి జిల్లాలోని కొల్లూరును మండల కేంద్రంగా ప్రకటించాలని అక్కడి ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని డీసీసీ స్పోక్స్​పర్సన్ ​జనంపల్లి దుశ్యంత్​రెడ్డి హెచ్చరించారు.