ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం

బోయినిపల్లి/కొత్తపల్లి/వేములవాడ రూరల్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం గాలి వాన బీభత్సం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన తోట శాంతమ్మ, వెలిచాల లక్ష్మిపతి, ఊదరి అంజయ్య, సాదక్​ నిషా, బడె రాజవ్వలకు చెందిన ఇండ్లు ధ్వంసమయ్యాయి.

గ్రామంలోని యూపీకి చెందిన బబ్లూ అనే వ్యక్తికి చెందిన పంచర్​ షాపు ఈదురుగాలులకు కొట్టుకుపోయింది. కొత్తపేట– మల్లాపూర్, వెంకట్రావుపల్లి–కొత్తపేట, వెంకట్రావుపల్లి గ్రామాల్లో రోడ్లపై భారీ వృక్షాలు నేలకొరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.  నీలోజిపల్లిలోని కేపీ ప్లాస్టిక్​ ఫ్యాక్టరీ పైకప్పు కొట్టుకుపోయింది. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి–నాగాయపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై చెట్లు విరిగి పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని వెలిచాల క్రాస్‌‌‌‌‌‌‌‌ వద్ద భారీ వృక్షం కూలి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– జగిత్యాల రహదారిలో సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు చెట్టును జేసీబీతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ను పునరుద్ధరించారు.