సముద్రం కింద గుడి గంటల సౌండ్‌‌

సముద్రం కింద గుడి గంటల సౌండ్‌‌

ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు బయటినుంచి ఏదైనా పెద్ద సౌండ్‌‌ వస్తే.. వెంటనే ఉలిక్కిపడుతుంటారు. ఆ సౌండ్‌‌ ఎక్కడి నుంచి వచ్చిందో అంచనా వేసుకున్నాకే కుదుట పడతారు. కెనడాలో కూడా ఇలాగే సముద్రగర్భంలో పెద్ద సౌండ్ వచ్చింది. కానీ.. ఆ సౌండ్‌‌ ఎందుకు వచ్చిందనేది ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. సైంటిస్ట్‌‌లు కూడా ఎన్నో రీసెర్చ్‌‌లు చేసి చివరకు చేతులెత్తేశారు. అందుకే ఐదున్నరేళ్ల క్రితం వచ్చిన ఈ సౌండ్‌‌ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు జనాలు. 

సుమారు మూడున్నరేళ్ల క్రితం ఓ రోజు అర్ధరాత్రి... నాగపూర్‌‌‌‌ సిటీలో ఏదో వింత సౌండ్‌‌ వినిపించింది. గుడి గంటల సౌండ్‌‌ని దూరం నుంచి విన్నట్టు ఉంది అది. జనాలు అయోమయంలో పడ్డారు. కాసేపటికి తేరుకుని ఆ సౌండ్‌‌ ట్రాఫిక్ సిగ్నల్స్‌‌ దగ్గర పెట్టిన స్పీకర్ల నుంచి వస్తున్నాయని తెలుసుకున్నారు. మరుసటి రోజు అవి టెక్నికల్‌‌ ఫెయిల్యూర్ వల్ల వచ్చాయని తెలిసింది. కానీ.. అసలు విషయం తెలిసేవరకు కొందరికైతే కంటి మీద కునుకు లేదు. కొన్ని గంటల పాటు ఆ సౌండ్​ రావడంతో వణికిపోయారు. కానీ.. దాదాపు ఐదున్నరేళ్ల క్రితం కెనడాలో ఇలాగే సౌండ్‌‌ వినిపించింది. కానీ.. ఇప్పటివరకు అవి ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలియలేదు. కెనడాలో కూడా ఒక చోట సముద్రపు అడుగుభాగం నుండి ఒక మిస్టీరియస్ ‘‘పింగ్” సౌండ్ వినిపించింది. కెనడాలోని ఫ్యూరీ అండ్ హెక్లా స్ట్రెయిట్‌‌ పాసేజ్‌‌ దగ్గర వచ్చిన ఈ సౌండ్‌‌ దాదాపు 120 కిలోమీటర్ల వరకు వినిపించింది. ఈ పాసేజ్‌‌ కెనడియన్ మెయిన్ ల్యాండ్‌‌ను బాఫిన్ ద్వీపం నుండి డివైడ్ చేస్తుంది. వాయువ్య పాసేజ్ నుంచి సరుకులు రవాణా చేసే షిప్పులు తిరుగుతుంటాయి. ఈ సౌండ్ వచ్చినప్పుడు కూడా ఆ దారిలో ఒక షిప్ వెళ్లింది. అందులో ఉన్న వర్కర్స్ కూడా సౌండ్ చాలా పెద్దగా వినిపించిందని, ఆ సౌండ్ విని చాలా భయపడ్డామని చెప్పారు. కెనడియన్ డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్‌‌కు ఈ వింత సౌండ్‌‌ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడివాళ్లు. వెంటనే మిలటరీ రంగంలోకి దిగింది. ఆ ప్రాంతానికి మిలటరీ ప్యాట్రోల్ ఎయిర్‌‌‌‌ క్రాఫ్ట్‌‌ వెళ్లింది. చుట్టుపక్కల మొత్తం గాలించి  ఆ సౌండ్‌‌ గురించి ఆరా తీశారు. కానీ.. ఒక్క క్లూ కూడా కనిపెట్టలేకపోయారు. గంటన్నర పాటు సౌండ్ వచ్చినా ఆ సౌండ్ ఏంటనేది సెన్సర్లు కనిపెట్టలేకపోయాయి. కాకపోతే ఈ సౌండ్‌‌ గురించి ఎన్నో థియరీలు పుట్టుకొచ్చాయి. వాటిలో ఏది నిజమనేది గవర్నమెంట్‌‌ ఇప్పటికీ తేల్చలేకపోయింది. 

తిమింగలాలు
ఈ సౌండ్‌‌ వచ్చిన పాసేజ్ మీదుగా బోహెడ్ తిమింగలాలు, బియర్డ్‌‌ సీల్స్, రింగ్డ్ సీల్స్ వలస  వెళ్తుంటాయి. వాటి వల్లే ఆ సౌండ్స్ వచ్చాయని చాలామంది చెప్పారు. పైగా సముద్రంలో బతికే ఏదో కొత్త జీవి ఇటు వైపు వచ్చి ఉంటుందని, దానివల్లే ఈ సౌండ్స్ వచ్చాయని అక్కడ చేపలను వేటాడేవాళ్లు కొందరు చెప్తున్నారు. ఈ పాసేజ్‌‌లో అనేక రకాల చేపలు ఉంటాయి. అందుకే జాలర్లు ఎక్కువగా ఇక్కడికి వచ్చి వేటాడతారు. సమ్మర్‌‌‌‌లో ఇక్కడ చేపలు పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి వేట ఈ సీజన్‌‌లో ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఈ సౌండ్‌‌ వచ్చిన తర్వాత సమ్మర్‌‌‌‌లో ఇక్కడ చేపల సంఖ్య కూడా చాలా తగ్గిపోయింది. పైగా ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లే సముద్ర జీవుల సంఖ్య కూడా ఈ సౌండ్స్ వినిపించినప్పటి నుంచి తగ్గింది. 

మైనింగ్‌‌
స్థానికంగా ఉన్న బాఫిన్‌‌ ల్యాండ్  మైనింగ్ కంపెనీ ఈ సౌండ్‌‌ వినిపించిన ప్లేస్‌‌కి కొద్ది దూరంలోనే మైనింగ్ చేస్తోంది. ఆ మైనింగ్‌‌ వల్లే ఇక్కడ సౌండ్‌‌ వచ్చిందని చాలామంది వాదించారు. అయితే ఆ కంపెనీ వాళ్లు ఆ సౌండ్‌‌కి కారణం తమ కంపెనీది కాదని చెప్తున్నారు. పైగా ఆ సౌండ్‌‌ వచ్చినప్పుడు మైనింగ్ పనులే జరగలేదని చెప్పారు. ఆ తర్వాత సముద్రపు జీవులను భయపెట్టడానికి, జాలర్లు వాటిని వేటాడకుండా ఉండేందుకు సముద్రపు అడుగులో సోనార్లను పెట్టారని కూడా కొందరు వాదించారు. కానీ.. పర్యావరణ శాఖ ఆ వాదనలను ఒప్పుకోలేదు. ఎందుకంటే.. ఆ పాసేజ్​లో నిర్మాణాలు, బ్లాస్టింగ్, హైడ్రోగ్రఫీ కోసం ఎలాంటి పర్మిషన్స్‌‌ లేవు. 

విదేశీ మిలిటరీ
ఫ్యూరీ అండ్‌‌ హెక్లా స్ట్రెయిట్‌‌ దగ్గరలోని హాల్ బీచ్‌‌లో కెనడా, అమెరికా కలిసి ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశాయి. ఆర్కిటిక్‌‌లోకి మిస్సైల్స్‌‌ వస్తే ట్రాక్ చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు. అయితే.. రష్యా అప్పుడప్పుడు తమ శత్రు దేశాలను గమనిస్తుంటుందని, అందుకే విమానాలు, నౌకలు, సబ్‌‌ మెరైన్స్‌‌ని ఆ దేశాలకు పంపుతుందని చాలామంది వాదించారు. 2014లో స్వీడిష్ జలాల్లో రష్యా సబ్‌‌మెరైన్‌‌ని కనుగొన్నారు. అలాగే ఇప్పుడు కూడా రష్యా సబ్‌‌ మెరైన్‌‌ను ఇక్కడికి పంపిందని ఎక్స్‌‌పర్ట్స్ అంచనా వేశారు. ఆ సబ్‌‌ మెరైన్‌‌ నుంచే ఈ సౌండ్ వచ్చిందన్నారు. అయితే.. ఒక సబ్‌‌మెరైన్ నుంచి అంత పెద్ద సౌండ్ వచ్చే అవకాశం లేదని మరికొందరు అంటున్నారు. అయితే.. రష్యా, కెనడాల మధ్య కూడా చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి. ఏ దేశానికి సొంతం కాని ఆర్కిటిక్‌‌లోని కొన్ని భాగాల కోసం రష్యా, కెనడాలు క్లెయిమ్‌‌ చేసుకున్నప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య చిన్న చిన్న తగాదాలు తలెత్తాయి. 

రాస్బీ వేవ్‌‌
ఇక్కడే కాకుండా ఇలాంటి సౌండ్‌‌ కరేబియన్ సముద్రంలో వచ్చినట్టు సైంటిస్ట్‌‌లు చెప్పారు. అక్కడ కూడా ఇలాంటి ఒక విచిత్రమైన సౌండ్ వినిపించింది. దానికి గల కారణాలు స్టడీ చేయడానికి బ్రిటన్‌‌లోని లివర్‌‌పూల్ యూనివర్సిటీ రీసెర్చర్స్‌‌ అక్కడికి వెళ్లారు. వాళ్లకు ఆ హమ్మింగ్ సౌండ్‌‌కి రాస్బీ వేవ్స్‌‌ కారణమని తెలిసింది. అందుకే దానికి ‘రాస్బీ విజిల్’ అని పేరు పెట్టారు. అలాంటిదే కెనడాలో జరిగి ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ.. సైంటిస్ట్‌‌లు స్టడీ చేసి దీనికి కారణం రాస్బీ వేవ్స్‌‌ కాదని తేల్చారు. 

మంచు గడ్డల వల్లనా?
ఈ సముద్రంలో పెద్ద పెద్ద మంచు గడ్డలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆర్కిటిక్‌‌లో వినిపించే  మంచు గడ్డలు ఒకదానికి ఒకటి రుద్దుకోవడం, ఢీ కొట్టడం, పగలడం వల్ల సౌండ్స్​ వస్తాయని కొందరు సైంటిస్ట్‌‌లు చెప్తున్నారు. ఈ సౌండ్‌‌ని ‘‘డెవిల్స్ సింఫనీ” అని పిలుస్తుంటారు. అయితే..  ఇక్కడ కూడా ఈ రకమైన సౌండ్ వచ్చి ఉంటుందంటున్నారు. కానీ.. ఆ సౌండ్ విన్నవాళ్లు మాత్రం ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి సౌండ్‌‌ వినలేదని, అది మంచు గడ్డల వల్ల రాలేదని బలంగా చెప్తున్నారు.

సముద్రాల సౌండ్
సముద్రాల్లో సౌండ్‌‌ వినిపించడం కొత్తేమీ కాదు. కానీ.. ఇక్కడ ఆ సౌండ్‌‌కి కారణం తెలియకపోవడమే మిస్టరీ. ఇదివరకు వచ్చిన సౌండ్‌‌కు సైంటిస్ట్‌‌లు కారణాన్ని తెలుసుకున్నారు. ఆ సౌండ్స్‌‌ చాలా తక్కువ ఫ్రీక్వెన్సీతో వినిపిస్తాయి. జియోఫిజికల్ రీసెర్చ్ జర్నల్‌‌లో సైంటిస్ట్‌‌లు చెప్పినదాని ప్రకారం... పసిఫిక్ మహా సముద్రం, ఉత్తర అమెరికా సముద్రంలో ఈ సౌండ్స్ ఎక్కువగా పుడుతున్నాయి. రెండు సమానమైన కెరటాలు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టినప్పుడు మరో పెద్ద కెరటం ఏర్పడుతుంది. ఆ కెరటం సముద్రగర్భంలోకి దూసుకెళ్తుంది. అలా వెళ్లి, అడుగుకు చేరాక అక్కడ రాళ్లను ఢీకొంటుంది. అప్పుడు ఈ సౌండ్ పుడుతుంది. ఒక్కోసారి లో-ఫ్రీక్వెన్సీ సౌండ్ చాలాసేపు వస్తుంది. అయితే.. ఈ సౌండ్ రెగ్యులర్‌‌‌‌గా వినేవాళ్లకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. 
::: కరుణాకర్​ మానెగాళ్ల