నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ : పమేలా సత్పతి

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ : పమేలా సత్పతి

కరీంనగర్, వెలుగు: రైతులకు నకిలీ విత్తనాలు, నిషేధిత పురుగు మందులు అమ్మితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని కరీంనగర్‌‌‌‌ కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం కరీంనగర్ గాంధీ రోడ్డులోని టీటీడీ కల్యాణ మండపంలో జిల్లాలోని విత్తనాలు, ఎరువుల డీలర్లకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి చీఫ్‌‌గెస్ట్‌‌గా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ డీలర్లు నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, నిషేధించిన పురుగుమందులు అమ్మొద్దని సూచించారు. ఒకవేళ అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  మార్కెట్లోకి నకిలీ విత్తనాలు, పురుగుమందులు రాకుండా వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో 15 రోజులకు ఒకసారి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.   

డీలర్లు లైసెన్సులను ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేసుకోవాలని, నిబంధనలు మేరకు అమ్మకాలు చేయాలన్నారు. సమావేశంలో డీఏవో శ్రీనివాస్, జిల్లా కోఆపరేటీవ్ ఆఫీసర్ రామానుజచార్య, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ దివ్యభారతి, ఏడీఏలు రణధీర్, సునీత, అంజలి, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రతినిధి గౌరిశెట్టి మహేందర్, అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.

 
100 శాతం రిజల్ట్ సాధించిన హెచ్ఎంలకు సన్మానం 

టెన్త్ లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన 84 హైస్కూళ్ల హెచ్ఎంలను కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ఘనంగా సన్మానించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎం లతో టెన్త్ ఫలితాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. 

ప్రభుత్వ పాఠశాలలను అన్ని రంగాల్లో సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దిన 10 మంది హెచ్ఎంలను ఎంపిక చేసి నగదు బహుమతి అందిస్తానని వెల్లడించారు. 6 నుంచి టెన్త్ చదివే విద్యార్థులకు షూస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.  కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఈఓ జనార్దన్ రావు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ నరసింహస్వామి, ఏఎంఓ అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, ఎంఈఓలు, అన్ని పాఠశాలల హెచ్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.