కోరుట్ల, వెలుగు : రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ధనవంతులను టార్గెట్‌గా చేసుకొని, మహిళలను పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్న హనీ ట్రాప్ ముఠాను జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ అనిల్‌కుమార్ బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా మెట్‌పల్లి దుబ్బవాడకు చెందిన రౌడీషీటర్ కోరుట్ల రాజ్‌కుమార్ అలియాస్ రాజు ఈజీ మనీ ఆశతో భర్తకు దూరంగా ఉంటున్న బలుమూరి స్వప్నతో పాటు బట్టు రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్, మాగని దేవనర్సయ్యతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మెట్‌పల్లి హనుమాన్‌నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని ధనవంతులను టార్గెట్‌గా చేసుకొని హనీట్రాప్ కు ప్లాన్ చేశాడు.
ఈ క్రమంలో కొందరి ఫోన్ నంబర్లు సేకరించిన నిందితుడు.. వారితో స్వప్నను మాట్లాడించి ఆ తర్వాత తన గదికి రప్పించేవాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న టైంలో నిందితులు ఒక్కసారిగా గదిలోకి వచ్చి తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసేవారు. తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరించి వారి నుంచి రూ. లక్షలు వసూలు చేసేవారు. ఇందులో భాగంగా మెట్‌పల్లికి చెందిన ఓ వ్యాపారిని ఈ నెల 28న తమ గదికి రప్పించి వీడియోలు తీసి, రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన పోలీసులు రాజ్‌కుమార్‌తో పాటు మాగని దేవనర్సయ్య, బలుమూరి స్వప్నను అరెస్ట్ చేయగా.. రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారని, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు.ముఠా పట్టుకున్న సీఐ అనిల్‌కుమార్, ఎస్సై కిరణ్‌కుమార్, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
