2025 నుంచి వస్తూ వస్తూ ఇన్వెస్టర్లు చాలా విషయాలపై అవగాహనతో పాటు పెట్టుబడులపై కొన్ని అనుమానాలనూ తమతో పాటు వెంట తెచ్చుకున్నారు. వీటిలో ప్రధానమైనది బంగారం, వెండిలో దేనిలో ఇన్వెస్ట్ చేయటం బెటర్. దేనికి కొత్త ఏడాదిలో బూమ్ ఉంటుంది అన్నదే. దీనిపై చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు కూడా అయోమయంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలో దేని ఫ్యూచర్ ఏంటనే వివరాలు తెలుసుకుందాం...
2026లో ఇన్వెస్ట్మెంట్ పరిస్థితిపై 'మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్' ఆసక్తికరమైన అంచనాలను విడుదల చేసింది. గత ఏడాది వెండి ధరలు చారిత్రాత్మక స్థాయిలో పెరిగిన తర్వాత.. ఇప్పుడు బంగారం ధరలతో పోలిస్తే వెండి కాస్త ఖరీదుగా మారిందని పేర్కొంది. సాధారణంగా బంగారం, వెండి ధరల మధ్య సమతుల్యతను 'గోల్డ్-సిల్వర్ రేషియో'తో కొలుస్తారు. 1998 నుండి దీని సగటు 67.90గా ఉండగా.. ప్రస్తుతం అది 59.42కి పడిపోయింది. అంటే బంగారం ధరతో పోలిస్తే వెండి ధరలు అనూహ్యంగా పెరిగాయని ఇది చెబుతోంది. 2020లో ఈ రేషియో 120 వరకు వెళ్లగా.. 2025 మొదటి భాగంలో కూడా 100 పైనే ఉంది. దీన్ని బట్టి వెండి విలువ ప్రస్తుతం గరిష్ట స్థాయిల్లో ఉందని తెలుస్తోంది.
2026లో వెండిపై బెట్ పెట్టొచ్చా..?
వెండిలో భారీ ర్యాలీ తర్వాత ఇప్పుడు ఇన్వెస్టర్ల నుంచి ప్రాఫిట్ బుక్కింగ్ జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోల్డ్ రేట్లు తగ్గితే సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేసి మద్దతు ఇస్తాయి.. కానీ వెండికి అటువంటి రక్షణ తక్కువగా ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వెండిలో ధరలు తగ్గే ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అందువల్ల కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు హై ఓలటాలిటీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, దీర్ఘకాలిక లక్ష్యంతోనే వెండిలో ఇన్వెస్ట్ చేయటం బెటర్ అని వారు సూచిస్తున్నారు.
►ALSO READ | జనవరి 1 నుంచి కొత్త రూల్స్: మారనున్న బ్యాంకింగ్, టాక్స్ రూల్స్ వివరాలివే..
మరి బంగారం పరిస్థితి ఏంటి..?
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికాలో ద్రవ్యోల్బణం, డాలర్ బలహీనపడటం వంటి కారణాలు 2026లో బంగారానికి సానుకూలంగా మారనున్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా బంగారం తన ప్రాభవాన్ని కొనసాగిస్తుందని మిరే అసెట్ పేర్కొంది.
వెండి రేట్ల ర్యాలీకి కారణాలు..
2025లో వెండి ధరలు పెరగడానికి ముఖ్యంగా పారిశ్రామిక డిమాండ్, సరఫరా లోటు కారణాలుగా ఉన్నాయి. కామెక్స్ గోదాముల్లో వెండి నిల్వలు 2020తో పోలిస్తే 70% తగ్గాయి. పైగా 2026 జనవరి నుండి చైనా కఠినమైన ఎగుమతి నిబంధనలను తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా సరఫరాపై ఒత్తిడి మరింతగా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు గోల్డ్, సిల్వర్ రెండింటిలోనూ సమానంగా ఇన్వెస్ట్ చేయటం బెస్ట్ ఆప్షన్. కేవలం ఒక్కదానికే ఎక్కువగా పరిమితం కావటం రిస్క్ పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వెండి ధరలు మరింతగా పెరిగితే.. ఇన్వెస్టర్లు క్రమంగా బంగారంలోకి పెట్టుబడులను మార్చుకోవడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు.
