కొత్త ఏడాది కేవలం క్యాలెండర్లు మార్చడమే కాదు.. సామాన్యుల జీవితాల్లో కీలకమైన ఆర్థిక మార్పులను కూడా తీసుకువస్తోంది. జనవరి 1, 2026 నుండి బ్యాంకింగ్, టాక్స్, రైతు సంక్షేమం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పులు ప్రతి ఒక్కరి జేబులపై ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఖచ్చితంగా. వీటికి సంబంధించిన పూర్తి మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
1. 8వ వేతన సంఘం అమలు:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది అతిపెద్ద తీపి కబురు. 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. జనవరి 1, 2026 నుండి 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి రానున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో పెరుగుదల ఉండనుంది. అయితే పెరిగిన జీతం చేతికి అందడానికి కొంత సమయం పట్టవచ్చు.
2. క్రెడిట్ స్కోర్ అప్‌డేట్స్.. ఇక వారానికోసారి!
ఇప్పటివరకు మీ క్రెడిట్ స్కోర్ 15 రోజులకు ఒకసారి అప్‌డేట్ అయ్యేది. కానీ ఇకపై కొత్త ఏడాదిలో క్రెడిట్ బ్యూరోలు ప్రతివారం డేటాను రిఫ్రెష్ చేయనున్నాయి. మీరు లోన్ వాయిదా చెల్లించినా లేదా డిఫాల్ట్ అయినా అది వెంటనే మీ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల లోన్ అప్రూవల్ ప్రక్రియ వేగవంతం అవుతుంది.
3. కొత్త ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫారమ్‌లు:
జనవరి 2026 నుండి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే విధానం మరింత సులభతరం కానుంది. కొత్తగా రూపొందించిన ఐటీఆర్ ఫారమ్‌లలో మీ బ్యాంకింగ్, ఖర్చుల వివరాలు ముందే ఫిల్ చేయబడి ఉంటాయి. ఇది పన్ను చెల్లింపుదారుల పనిని తగ్గించడంతో పాటు.. తప్పుడు వివరాలను నమోదు చేసే అవకాశం లేకుండా చేస్తుంది.
4. రైతులకు కొత్త 'డిజిటల్ ఫార్మర్ ఐడీ':
పీఎం-కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందాలనుకునే కొత్త దరఖాస్తుదారులకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి. ఈ ఐడీ ద్వారా రైతు భూమి వివరాలు, పండించే పంటలు, ఆధార్ బ్యాంక్ ఖాతాను అనుసంధానిస్తారు. ఇది పారదర్శకతను పెంచి, అర్హులైన రైతులకు నేరుగా నగదు చేరేలా చేస్తుంది. ఇప్పటికే లబ్ధి పొందుతున్న పాత రైతులకు ఇది వర్తించదు.
►ALSO READ | జనవరి 1న షాక్: పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు, తగ్గిన పీఎన్జీ రేట్లు..
5. బ్యాంకింగ్ రూల్స్ మార్పులు:
* పాన్-ఆధార్ లింకింగ్: మీరు ఇంకా మీ పాన్ ఆధార్‌ను లింక్ చేయకపోతే.. మీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే టాక్స్ రీఫండ్స్ పొందడం కూడా కానుంది కొత్త ఏడాదిలో.
* డిజిటల్ భద్రత: యూపీఐ లావాదేవీలపై నిఘా పెరగనుంది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా జరిగే మోసాలను అరికట్టడానికి బ్యాంకులు కఠినమైన 'సిమ్ వెరిఫికేషన్' నిబంధనలను అమలులోకి తెస్తున్నాయి.
* కో-లెండింగ్ రూల్స్: ఆర్‌బీఐ కొత్త రూల్ ప్రకారం.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కలిసి ఇచ్చే రుణాల్లో ప్రతి లెండర్ కనీసం 10% రిస్క్‌ను భరించాల్సి ఉంటుంది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది.
