జనవరి 1న షాక్: పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు, తగ్గిన పీఎన్జీ రేట్లు..

జనవరి 1న షాక్: పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు, తగ్గిన పీఎన్జీ రేట్లు..

కొత్త ఏడాది తొలిరోజే ప్రజలకు గ్యార్ రేట్ల సెగ తగిలింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు భారీగా పెరగ్గా, మరోవైపు గృహ వినియోగదారులకు ఊరటనిస్తూ పీఎన్జీ ధరలు కూడా తగ్గాయి. దీంతో జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి.

కమర్షియల్ అవసరాల కోసం ఉపయోగించే 19 కేజీల వాణిజ్య సిలిండర్ల న్యూఇయర్ రోజున రూ.111 పెరిగింది. ప్రభుత్వం 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఒక్కసారిగా పెంచటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న తరహా పరిశ్రమలపై అదనపు భారం పడింది. సవరించిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి:

* ఢిల్లీ: రూ.1,580.50 నుండి రూ.1,691.50కి పెరిగింది.
* కోల్‌కతా: రూ.1,684 నుండి రూ.1,795కి చేరింది.
* ముంబై: రూ.1,531 నుండి రూ.1,642.50కి పెరిగింది.
* హైదరాబాద్: ఇక్కడ వాణిజ్య సిలిండర్ ధర రూ.1,912.50 గా ఉంది.

సాధారణ ప్రజలు ఇళ్లలో వాడే 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు రాలేదు కొత్త ఏడాది మెుదటి నెలలో. ఇది మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట. ప్రస్తుతం వివిధ నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధరలు రూ. 850 నుండి రూ. 960 మధ్య కొనసాగుతున్నాయి. 

* హైదరాబాద్: రూ. 905
* విజయవాడ/విశాఖపట్నం: రూ. 850 - రూ. 870 (సుమారుగా)
* ఢిల్లీ: రూ. 853
* పాట్నా: రూ. 951

తగ్గిన పీఎన్జీ ధరలు..
వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగినప్పటికీ, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్(IGL) ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది పైపుల ద్వారా గ్యాస్ పొందే ఇళ్లకు ఆర్థికంగా కలిసిరానుంది.

గ్యాస్ ధరల పెరుగుదలకు కారణాలు:
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు, దిగుమతి సుంకాలు, రూపాయి-డాలర్ మారకం విలువ, రవాణా ఖర్చుల ఆధారంగా చమురు సంస్థలు ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను సమీక్షిస్తాయి. రాష్ట్ర పన్నులు వేర్వేరుగా ఉండటం వల్ల ఒక్కో నగరంలో ఒక్కో రకమైన ధరలు ఉంటాయి. మొత్తానికి కొత్త ఏడాదిలో వ్యాపారస్తులకు ఖర్చులు పెరిగినా, సామాన్య గృహిణులకు మాత్రం వంటింటి బడ్జెట్ మారకపోవడం గమనార్హం.