మూడు ప్రమాదాల్లో ఆరుగురు మృతి.. హన్మకొండ, వనపర్తి, కరీంనగర్ జిల్లాల్లో ఘటనలు

మూడు ప్రమాదాల్లో ఆరుగురు మృతి.. హన్మకొండ, వనపర్తి, కరీంనగర్ జిల్లాల్లో ఘటనలు
  • హనుమకొండ జిల్లాలో బైక్‌‌ను ఢీకొట్టిన టిప్పర్, ఇద్దరు స్టూడెంట్లు..
  • వనపర్తి జిల్లా రేవల్లిలో ఇద్దరు...
  • కరీంనగర్‌‌ జిల్లా చొప్పదండిలో మరో ఇద్దరు మృతి

హసన్‌‌పర్తి, వెలుగు : బైక్‌‌ను టిప్పర్‌‌ ఢీకొనడంతో ఇద్దరు స్టూడెంట్లు చనిపోయారు. ఈ ప్రమాదం హనుమకొండ జిల్లా హసన్‌‌పర్తిలోని పెద్దచెరువు మూలమలుపు వద్ద శుక్రవారం జరిగింది. ములుగు జిల్లా మంగపేటకు చెందిన జమీల్‌‌ అక్రమ్‌‌ కుమారుడు జునైద్‌‌ అక్రమ్‌‌ (23), వరంగల్‌‌ ఎల్లంబజార్‌‌కు చెందిన ఆకుతోట ఉమామహేశ్వర్‌‌ కూతురు సుప్రతిక (21) అనంత సాగర్‌‌ శివారులోని ఎస్‌‌ఆర్‌‌ యూనివర్సిటీలో బీటెక్‌‌ థర్డ్‌‌ ఇయర్‌‌ చదువుతున్నారు. శుక్రవారం ఇద్దరు కలిసి కాలేజీ నుంచి బైక్‌‌పై హనుమకొండకు వస్తుండగా.. హసన్‌‌పర్తి శివారులోని పెద్దచెరువు మూలమలుపు వద్దకు రాగానే వెనుక నుంచి టిప్పర్‌‌ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. 

జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా...

రేవల్లి, వెలుగు : ఎదురుగా వస్తున్న ఆటోను ట్రాక్టర్‌‌ ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోగా మరికొందరికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని ఏదుల రైస్‌‌మిల్‌‌ సమీపంలో గురువారం రాత్రి జరిగింది. మండలంలోని కొంకలపల్లి గ్రామానికి చెందిన సుమిత్ర (45), కోమారి వెంకటయ్య(50) మరికొందరితో కలిసి ఆటోలో మంత్రాలమ్మ జాతరకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఏదుల రైస్‌‌మిల్‌‌ సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌‌ ఢీకొట్టింది. ప్రమాదంలో సుమిత్ర, వెంకటయ్య అక్కడికక్కడే చనిపోగా పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌‌ డ్రైవర్‌‌ కదిరె భాస్కర్‌‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఫ్రెండ్‌‌ పెండ్లికి బయలుదేరిన రెండు నిమిషాలకే...

చొప్పదండి, వెలుగు : బైక్‌‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదం కరీంనగర్‌‌ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌‌లో శుక్రవారం జరిగింది. చొప్పదండికి చెందిన చిలుక రాజేశం చిన్న కుమారుడు చిలుక ప్రదీప్​(24), అతడి స్నేహితుడు రుక్మాపూర్‌‌ గ్రామానికి చెందిన తాటికొండ సాయికిరణ్‌‌ (24)తో కలిసి బైక్‌‌పై చాకుంట గ్రామంలో మరో ఫ్రెండ్‌‌ పెండ్లికి వెళ్తున్నారు. రుక్మాపూర్‌‌ గ్రామ శివారులోకి రాగానే కరీంనగర్‌‌ నుంచి చొప్పదండి వైపు వెళ్తున్న లారీ.. బైక్‌‌ను  వెనుక నుంచి ఢీకొట్టింది. కిందపడిన ప్రదీప్‌‌, సాయికిరణ్‌‌ తలపై నుంచి లారీ వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.