మార్చి 6, 2026 శుక్రవారం నాడు భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం ముదరడం, దుబాయ్‌పై క్షిపణి దాడుల భయాలు పెరగటంతో పాటుగా.. దేశీయంగా అనిల్ అంబానీ గ్రూపుపై ఈడీ దాడులు వెరసి ఇన్వెస్టర్ల కొంపముంచాయి. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.6 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది.
ఉదయం నుంచే నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. మధ్యాహ్నం సమయానికి ఫ్రీ ఫాల్ దిశగా వెళ్లాయి. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 1,097 పాయింట్లు నష్టపోయి 78,919 స్థాయి వద్ద ముగిసింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 315 పాయింట్లు పతనమై 24,450 పాయింట్ల వద్ద స్థిరపడింది. యుద్ధం కారణంగా క్రూడాయిల్ సరఫరా నిలిచిపోతుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు భయపడి భారీగా అమ్మకాలు జరిపారు.
ALSO READ : యుద్ధం ముంగిట దుబాయ్?
అనిల్ అంబానీ షేర్ల పతనం..
ముంబై, హైదరాబాద్‌లోని అనిల్ అంబానీ కార్యాలయాలపై ఈడీ దాడులు జరుగుతున్నాయన్న వార్త మార్కెట్‌లో సెన్సేషన్ సృష్టించింది. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు ఒక్కసారిగా 10% నుంచి 15% వరకు నష్టపోయాయి. అనిల్ అంబానీ గ్రూప్ సంస్థల్లో నిధుల మళ్లింపు ఆరోపణలు రావడంతో ఇన్వెస్టర్లు ఆ షేర్ల నుంచి తప్పుకునేందుకు అమ్మకాల్లో పోటీ పడ్డారు. ఇది కేవలం ఆ ఒక్క గ్రూపునే కాకుండా మొత్తం పవర్ అండ్ ఇన్‌ఫ్రా రంగాన్ని కుదిపేసింది.
ఇక అంతర్జాతీయ యుద్ధ పరిణామాలను గమనిస్తే.. దుబాయ్‌లో క్షిపణి దాడుల అలర్ట్ రావడం, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవ్వడం ప్రపంచవ్యాప్త మార్కెట్లను వణికించాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల పాకిస్తాన్ వంటి దేశాలు చమురు సంక్షోభంలో చిక్కుకోవడం, భారత్‌లో కూడా పెట్రోల్ ధరలు పెరుగుతాయన్న భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా నిధులను వెనక్కి తీసుకోవడం కూడా మరో కారణంగా మారింది.
నేటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియల్టీ రంగాలు కోలుకోలేని విధంగా నష్టపోయాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లు పతనం కావడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా తగ్గింది. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ భారీగా తగ్గటంతో ఇన్వెస్టర్లకు నిరాశే మిగిలింది.
