కండోమ్ ధరలు భారీగా పెంచితే.. పిల్లలు పుట్టేస్తారా: ఇదేం లాజిక్ అంటున్న చైనా యూత్

కండోమ్ ధరలు భారీగా పెంచితే.. పిల్లలు పుట్టేస్తారా: ఇదేం లాజిక్ అంటున్న చైనా యూత్

చైనా దేశం.. ఒకప్పుడు భూ మండలంపైనే అత్యధిక జనం ఉన్న దేశం.. ఇప్పుడు కూడా జనాభాలో చైనానే ఉంది. రాబోయే రోజుల్లో చైనాలో జనాభా సంఖ్య వేగంగా తగ్గిపోనుంది. దీనికి కారణం.. జననాల రేటు దారుణంగా పడిపోవటమే. 2025 లెక్కల ప్రకారం.. చైనా దేశం మొత్తంలో కేవలం కోటి మంది పిల్లలు మాత్రమే పుట్టారు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కోటికి 50 వేల మంది తక్కువే.. అవును.. చైనా ప్రభుత్వం ఈ విషయంపై 2026లో కీలక నిర్ణయం తీసుకున్నది. అదేంటో తెలిస్తే మీరూ అవాక్కవుతారు. నవ్వుతారు.. ఆశ్చర్యపోతారు.. ఎందుకంటే ఇప్పుడు యూత్ కూడా ఇలాగే ఫీలవుతుంది. 

జననాల సంఖ్యను పెంచటం కోసం చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కండోమ్స్ ధరలను భారీగా పెంచింది. అదే విధంగా గర్భ నిరోధకాల మెడిసిన్స్, గర్భ నిరోధకాలకు సంబంధించిన అన్నింటిపై 13 శాతం అదనపు ట్యాక్స్ వేసింది. దీని వల్ల కండోమ్స్ కొనుగోలు చేయటం ఆయా జంటలకు భారం అవుతుందని.. అప్పుడు పిల్లలు పుట్టే సంఖ్య పెరుగుతుందని చైనా భావిస్తుంది. ఈ నిర్ణయంపై చైనా సోషల్ మీడియాలో యూత్ పంచ్ లు వేస్తున్నారు. 

కండోమ్స్ ధరలు పెంచారు అంటే.. ముందుగానే ఏడాది, రెండేళ్లకు అవసరం అయితే కండోమ్స్ ఇప్పుడే కొని పెట్టుకోమని చెబుతున్నారా అంటూ రివర్స్ పంచ్ వేస్తున్నారు చైనా యువ జంటలు. అంతే కాదు.. కండోమ్ ధరలు పెంచటం ద్వారా పిల్లల సంఖ్య పెరుగుతుందనే ఆలోచన రావటమే అద్భుతం.. మహా అద్భుతం అంటూ చురకలు అంటిస్తున్నారు. మనం పిల్లల్ని కనటానికి మన కంటే ప్రభుత్వమే చాలా ఎక్కువగా కష్టపడుతుంది అంటూ మరికొంత మంది నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

యువ జంటలు నిజంగా పిల్లల్ని కనకపోవటానికి కారణం ఏంటో ఈ ప్రభుత్వానికి ఇంకా తెలియటం లేదు.. అసలు సమస్యపై దృష్టి పెట్టకుండా ఇలా కండోమ్ ధరలు పెంచటంపై ఎక్కువ శ్రమ పడుతుంది అంటూ యువ జంటలు ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తున్నారు. 

పిల్లల్ని కనకపోవటానికి కారణాలు ఏంటీ అనేది చైనా యువ జంటలు ఇలా చెబుతున్నాయి. జీవన వ్యయం.. నెలవారీ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. పిల్లల రక్షణ, వాళ్ల చదువులు, వైద్య ఖర్చులు భరించలేని విధంగా ఉన్నాయి. పిల్లల చదువులకు తగ్గట్టు జీతాలు లేవు.. ఆదాయాలు పెరగటం లేదు. పిల్లల పెంపకం అనేది అత్యంత ఖరీదైనది మారింది. మా జీవితాలే సక్రమంగా లేవు.. మా జీవితాలనే హ్యాపీగా సాగటం లేదు.. ఇలాంటప్పుడు పిల్లల్ని కని వాళ్లను ఎలా పెంచగలం.. ధరల తగ్గింపు.. ఉచిత విద్య, వైద్యం వంటివి అందుబాటులోకి వచ్చినప్పుడే పిల్లల్ని కంటాం.. అప్పటి వరకు పిల్లల్ని కనేది లేదని చైనా యువ జంటలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు..

కండోమ్స్ ధరలు పెంచినంత మాత్రాన పిల్లల సంఖ్య పెరుగుతుంది అనేది మూర్ఖత్వం అంటూ తిట్టిపోస్తున్నారు చైనా యువ జంటలు.