బీఆర్ఎస్ కావాలనే ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి . కృష్ణా జలాల్లో కేసీఆర్, హరీశ్ రావు ఆనాడు చేసిన సంతకాలే తెలంగాణకు మరణశాసనం అని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే..ఆధారాలతో సహా అన్ని వివరాలు సభలో పెడతామని చెప్పారు రేవంత్. తెలంగాణకు చేసిన అన్యాయానికి కేసీఆర్, హరీశ్ ను ఉరితీసినా తప్పులేదన్నారు రేవంత్.
నీళ్లు- నిజాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి. నీటి హక్కుల కోసమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. కృష్ణా, గోదావరి నదులే మన జీవన్మరణ సమస్య. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ హక్కుల కోసం సొంత పార్టీనే మా నేతలు ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 34 శాతం, ఏపీకి 66 శాతం నీటి వాటాలకు కేసీఆర్,హరీశ్ ఒప్పుకున్నారు. కృష్ణాలో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్, హరీశ్ రావు సంతకాలు చేశారు. కేసీఆర్,హరీశ్ సంతకాలే తెలంగాణకు మరణశాసనం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నింట్లోనూ ఓటమితో సర్కారుపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. పార్టీ మనుగడ కోసం జలవివాదాలు సృష్టిస్తున్నారు. అబద్దాల సంఘాలు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం వెనుక ఎటువంటి ఫార్ములా లేదు. ప్రాజెక్టులు, పంపులు ఎన్ని పెరిగితే అంత కమీషన్లు వస్తాయన్నదే ప్లాన్.
కమీషన్ల కోసం పాలమూరును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారు. ఏపీ కృష్ణా బేసిన్ నీళ్లను పెన్నా బేసిన్ లోకి తరలిస్తోంది. ఒక బేసిన్ నుంచి మరో బేసిన్ కు నీటిని తరలించొద్దు. పెన్నా బేసిన్ కు కృష్ణా నీటి తరలింపును కేసీఆర్ ఎన్నడూ ప్రశ్నించలేదు. దోపిడి బయటకొస్తుందనే పాలమూరు డీపీఆర్ తయారుచేయలేదు. ఏడేళ్ల వరకు పాలమూరు డీపీఆర్ రెడీ చేయలేదు. రూ.20 వేల కోట్లు చెల్లించే వరకు ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేయలేదు. రాజకీయ లబ్ధి కోసం మేం పక్క రాష్ట్రాన్ని తిట్టడం లేదు. మేం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం.. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. రేపు అసెంబ్లీలో అన్ని డాక్యుమెంట్లు ముందు పెడతాం.
ప్రాజెక్టులకు నిధులు,అనుమతుల కోసమే ఢిల్లీ వెళ్తున్నా. బలమైన వాదనలు వినిపిస్తూ ముందుకెళ్తున్నాం. కేసీఆర్ రాజకీయ సమాధి తప్పదనే నీటి వాటాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు. అబద్ధాల పోటీ పెడితే కేసీఆర్, హరీశ్, కేటీఆర్ లకు ఫస్ట్ ప్రైజ్ వస్తది. కేసీఆర్ సభకు రాడు..అందుకే బహిరంగ సభలు పెడతా అంటున్నరు. సభకు వస్తే అన్ని వాస్తవాలు బయటపెడతా.. కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి. ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కల్గించం. వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో తేలాలి. కిరణ్ కుమార్ కంటే కేసీఆర్,హరీశ్ తెలంగాణ దుర్మార్గులు. కేసీఆర్,హరీశ్ చేసిన పాపానికి ఉరి తీసినా తప్పులేదు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేవాళ్లు.భారత్ ప్రజాస్వామ్య దేశం కాబట్టి చట్టం ప్రకారం ముందుకెళ్తున్నాం. అని రేవంత్ అన్నారు.
