భద్రాద్రిలో నత్తనడకన ‘ప్రసాద్’ ​పనులు!

భద్రాద్రిలో నత్తనడకన ‘ప్రసాద్’ ​పనులు!
  •     ఈనెలలోనే పూర్తి కావాల్సింది..  కానీ ఇంకా పూనాది స్థాయిలోనే.. 
  •     నిర్లక్ష్యం వీడని అధికారులు.. నిధులు నిల్చిపోయే  ప్రమాదం! 

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం పరిధిలో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పిలిగ్రేమేజ్​ రెజువెనేషన్​ అండ్​ స్పిర్చువల్​ ఆగ్​మెంటేషన్​ డ్రైవ్​(ప్రసాద్​) పనులు నత్తనడకన సాగుతున్నాయి.

కాంట్రాక్టర్, టూరిజం శాఖ నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. 2022 డిసెంబరు 28న దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలంలో ఈ పనులకు శంకుస్థాపన చేశారు. మే 2024 నాటికి ఈ పనులు పూర్తి కావాలి. కానీ నేటికీ పనులు పునాదిస్థాయిలోనే ఉండటం విశేషం.

రూ.41 కోట్ల పనులు.. 

ప్రసాద్​ పథకం కింద ఆలయం పరిధిలోని పనులకు రూ.41కోట్లు మంజూరు కాగా, తొలివిడతగా రూ.22 కోట్లు రిలీజ్​ చేశారు. భద్రాచలంలో మిథిలాస్టేడియం వెనుక, బ్రిడ్జి వద్ద రెండు భవనాల కోసం భూమి కేటాయించగా పనులు మొదలయ్యాయి. ఈ పనులు ఇంకా పునాది స్థాయిలోనే ఉండటం గమనార్హం. ఇటీవల రాష్ట్ర టూరిజం శాఖ ప్రధాన కార్యదర్శి పనులు వేగంగా చేయాలని ఆదేశించినా ఇంకా కాంట్రాక్టర్​ నిర్లక్ష్యంగానే ఉన్నారు.

పర్ణశాలలో తొలుత కేటాయించిన భూమి సీతమ్మసాగర్​ ప్రాజెక్టులో పోవడంతో భద్రాచలం దేవస్థానం మరో భూమిని కేటాయించింది. రెండుఎకరాల్లో పనులు ఇటీవలే మొదలైనా సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఎంఓయూ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. టూరిజం  శాఖ విధించిన నిబంధనపై దేవస్థానం అభ్యంతరం తెలుపుతోంది. టూరిజం డిపార్ట్​మెంట్​ మాత్రం పనులు పూర్తి చేసి దేవస్థానానికి అప్పగిస్తామని చెబుతోంది.  

ఇతర పనులు చేసే అవకాశమున్నా చేయట్లే.. 

ఇతర పనులు మొదలుపెట్టేందుకు అవకాశం ఉన్నా ఆఫీసర్లు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్య కల్యాణ మండపం రూఫింగ్, ఆంజనేయస్వామి ఆలయం, మిథిలాస్టేడియం పై డిటాచబుల్​ రూఫింగ్​, ఆలయంలో ఫ్లోరింగ్​, ప్రసాదాల తయారీ ఆధునీకరణ, క్యూలైన్లలో రైలింగ్, దివ్యాంగులకు, సామాన్య భక్తులకు లిప్ట్ లు, సెంట్రల్​ లైటింగ్​ సిస్టం

బయోటాయిలెట్స్, బ్యాటరీ వెహికల్స్ ఇవన్నీ ప్రసాద్​ నిధుల్లో ఉన్నాయి. కేవలం భవనాలపైనే దృష్టి పెట్టి మిగతా వాటిని గాలికొదిలేశారు. ఇలా వదిలేస్తే సకాలంలో ఖర్చు చేయలేదని నిధులు నిలిపివేసే ప్రమాదం ఉంది. దీనిపై టూరిజం డీఈని వివరణ కోరగా పనులు జరుగుతున్నాయని, సకాలంలోనే పూర్తి చేస్తామని తెలిపారు.