డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శేషగిరిరావు మృతి

డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శేషగిరిరావు మృతి
  •     పలువురి బీఆర్​ఎస్​ నేతల సంతాపం

తల్లాడ/ఖమ్మం టౌన్,  వెలుగు : ఖమ్మం జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు మృతి చెందారు. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రాయల వెంకట శేషగిరిరావు(69) కొంతకాలంగా లివర్ కు సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని ఓ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి బుధవారం మధ్యాహ్నం చనిపోయారు. 1982లో  తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన శేషగిరిరావు తల్లాడ మండల పరిషత్ మొదటి ఎంపీపీగా 1987 నుంచి 1992 వరకు సేవలందించారు.

అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివిధ పదవుల్లో ప్రజలకు సేవలందించారు. 2018 లో జరిగిన ఎన్నికల తర్వాత సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తోపాటు బీఆర్ఎస్ లో చేరి గంగదేవి పాడు సొసైటీ చైర్మన్ గా, జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. రాయల శేషగిరిరావు మృతితో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివిధ పార్టీల నాయకులు, అభిమానులు సంతాపం తెలిపారు.

రాయల చనిపోయిన విషయం తెలిసి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వరరావు హైదరాబాద్​లోని యశోద హాస్పిటల్ కు చేరుకొని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. బీఆర్ఎస్ నేతలు నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సంతాపం తెలిపారు.