టైటిల్: జగమే మాయ, కాస్ట్: ధన్య బాలకృష్ణ, తేజ అయినంపూడి, పృథ్వీరాజ్, చైతన్య రావు,
లాంగ్వేజ్: తెలుగు, ఫ్లాట్‌ఫాం: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
రన్‌టైం: 111 నిమిషాలు
డైరెక్షన్: సునీల్ పుప్పాల
ఆనంద్ (తేజ మైనంపూడి) ఒక ఫ్రాడ్. ఐపీఎల్ బెట్టింగ్‌లో డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. కానీ.. కథ అడ్డం తిరిగి, లక్షలు పోగొట్టుకుంటాడు. అప్పు ఇచ్చిన వాళ్లు ఆనంద్‌ని ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ల నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ బాగా డబ్బున్న అమ్మాయిని లవ్‌లో పడేసి, సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అవుతాడు. అదే టైంలో చిత్ర (ధన్య బాలకృష్ణ) పరిచయం అవుతుంది. ఆమె ఒక అనాథ.
ఆమెకి అప్పటికే పెండ్లి అవుతుంది. కానీ.. భర్త చనిపోతాడు. అయినా.. ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయని పెండ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె గురించి ఒక నిజం తెలుస్తుంది? ఆ నిజమేంటి? చిత్ర గతమేంటి? అనేవి తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే. కథ, ట్విస్ట్ బాగానే ఉన్నా.. స్క్రీన్ ప్లే పెద్దగా ఆకట్టుకోలేదు. కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో కామెడీ బాగుంది. కానీ.. సెకండాఫ్‌లో కథ చాలా స్లోగా నడుస్తుంది.
ఎత్తుకు పై ఎత్తు
టైటిల్: గోవిందా నామ్ మేరా , కాస్ట్: విక్కీ కౌశల్ కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్, షాయాజీ షిండే, రేణుకా షహానే
లాంగ్వేజ్: హిందీ, ఫ్లాట్‌ఫాం: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
రన్‌టైం: 131 నిమిషాలు, డైరెక్షన్: శశాంక్ ఖైతాన్
గోవిందా (విక్కీ కౌశల్) సైడ్ డాన్సర్‌గా పనిచేస్తుంటాడు. కొరియోగ్రాఫర్‌గా ఎదగాలనేది అతని కోరిక. తనకు గౌరి (భూమి పెడ్నేకర్)తో పెండ్లి అవుతుంది. కానీ.. ఆమె గోవిందాని అస్సలు పట్టించుకోదు. దాంతో గోవిందా ఆమె నుంచి విడాకులు తీసుకోవాలి అనుకుంటాడు. గౌరి మాత్రం వాళ్ల నాన్న తన పెండ్లి కోసం ఖర్చు చేసిన రెండు కోట్ల రూపాయలు తిరిగి ఇస్తేనే విడాకులు ఇస్తానని డిమాండ్ చేస్తుంది. అప్పటికే సుక్కు(కియారా అద్వానీ) అనే మరో అమ్మాయితో లవ్‌లో ఉంటాడు గోవింద.
గౌరితో విడాకులు తీసుకుని, సుక్కుని పెండ్లి చేసుకోవాలన్నది అతని ప్లాన్. గౌరికి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. గోవిందకి తన సవతి తల్లి కుటుంబంతో ఆస్తి గొడవలు ఉంటాయి. కోర్టులో కేసు నడుస్తుంటుంది. ఆ కేసులో గోవింద వైపు తీర్పు వస్తే కొన్ని కోట్లు విలువ చేసే బిల్డింగ్ సొంతం అవుతుంది. ఆ ఆస్తి రాగానే ముందుగా తన భార్య పీడ వదిలించుకోవాలి అనుకుంటాడు.
అలా డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న టైంలో అతనికి డ్రగ్స్ దొరుకుతాయి. అప్పుడే అతని భార్య గౌరిని ఎవరో హత్య చేస్తారు. ఆ శవాన్ని సుక్కు, గోవింద కలిసి పాతిపెడతారు. ఇంతకీ ఆ డ్రగ్స్ ఏం చేశారు? గౌరీని ఎవరు చంపారు? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గోవింద రోల్లో చేసిన విక్కీ కౌశల్ బాగా నటించాడు. మొదటి గంటన్నర ఒకలా, చివరి అరగంట మరోలా అనిపిస్తాడు. కియారా అద్వానీ విషయానికొస్తే.. అదరగొట్టిందనే చెప్పాలి. గోవింద లాయర్ పాత్రలో కనిపించిన అమే వాగ్ చేసిన కామెడీ బాగా నవ్విస్తుంది. కథలో ట్విస్ట్‌లు బాగున్నాయి.
ఒక కుర్రాడు.. బోలెడు కలలు
టైటిల్: హాఫ్ ప్యాంట్స్ ఫుల్ ప్యాంట్స్, కాస్ట్: అశ్వంత్ అశోక్‌కుమార్, సోనాలి కులకర్ణి, ఆశిష్ విద్యార్థి
లాంగ్వేజ్: హిందీ, ఫ్లాట్‌ఫాం: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్లు : 8, డైరెక్షన్: వీకే ప్రకాశ్ ఆనంద్ (అశ్వంత్ అశోక్‌కుమార్) ఏడేండ్ల కుర్రాడు. తండ్రి సుబ్బారావు ఇండియన్ రైల్వేస్‌లో గార్డుగా పనిచేస్తుంటాడు. అందుకే రైలు నెట్‌వర్క్ అంతా తనదే అన్నట్టు ఫీల్ అవుతుంటాడు ఆనంద్. సిరీస్‌లోని ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో సాహసం చేస్తుంటాడు.
పెద్దల దృష్టిలో చిన్నగా ఉండే ఈ సాహసాలు ఈ బుల్లి హీరోకి చాలా పెద్దవి. కుక్క తప్పిపోయినప్పుడు అతని బెస్ట్ ఫ్రెండ్ రఘు, ఇంకొందరు ఫ్రెండ్స్ ముందు ఆనంద్ ఒక మినీ-షెర్లాక్ హోమ్స్‌గా మారిపోతాడు. కాయిన్స్‌ని ట్రైన్ ట్రాక్‌లపై పెడితే.. వాటికి అయస్కాంత శక్తి వస్తుందని తెలుసుకున్నప్పుడు సైంటిస్ట్‌గా మారిపోతాడు. ఇలా.. ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక అల్లరి చేస్తుంటాడు. ఒక టైంలో బ్రూస్ లీపై ఇష్టం పెంచుకుంటాడు. తనని ఎవరూ అర్థం చేసుకోవడం లేదని ఒకరోజు ఇంట్లో నుంచి పారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. అశ్వంత్ అశోక్‌కుమార్ యాక్టింగ్ చాలా బాగుంది.
