ఈజిప్టుతో సంబంధాలు బలోపేతం

ఈజిప్టుతో సంబంధాలు బలోపేతం

కైరో: ప్రధాని నరేంద్ర మోదీకి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఈజిప్టుతో సంబంధాల బలోపేతానికి, మానవాళికి వెలకట్టలేని సేవలు చేసే వివిధ దేశాల అధినేతలకు ఇచ్చే ఈజిప్టు అత్యున్నత అవార్డు ‘ఆర్డర్ ఆఫ్ ద నైల్’ను ఆయన అందుకున్నారు. ఆదివారం కైరోలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సీసీ అవార్డును ప్రదానం చేశారు. దీంతో మోదీ ఇప్పటివరకు 13 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నట్లయింది. ఇంతకుముందు పపువా న్యూగినియా, ఫిజి, పలావు, భూటాన్, అమెరికా, బహ్రెయిన్, మాల్దీవ్స్, రష్యా, యూఏఈ, పాలస్తీనా, అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారంతో మోదీని గౌరవించాయి.  అమెరికాలో నాలుగు రోజుల పర్యటన ముగించుకున్న మోదీ శనివారం రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈజిప్టు చేరుకున్నారు. ఆదివారం కైరోలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో మోదీ, ఎల్ సీసీ భేటీ అయ్యారు.

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు పెంచడం, ఇంధన రంగంలో సహకారం, ప్రజల అనుసంధానం వంటి అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు అబ్దెల్ ఫతా ఎల్ సీసీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలు మరింత పటిష్టం చేసుకుందామని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈజిప్టు పర్యటనకు రావాలని ఎల్ సీసీ ఆహ్వానించగా మోదీ ఈ మేరకు ఆ దేశానికి వెళ్లారు. 

గ్రాండ్ ముఫ్తీతో సమావేశం

ఈజిప్టులోని ఇస్లామిక్ లీగల్ రీసెర్చ్ కేంద్రం అయిన దార్ అల్ ఇఫ్తాలో ఇండియా తరఫున ఐటీలో సెంటర్ ఆఫ్​ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. శనివారం ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ (ఇస్లామిక్ న్యాయాధిపతి) డాక్టర్ షాకీ ఇబ్రహీం అబ్దెల్ కరీం ఆలంతో మోదీ భేటీ అయ్యారు. సామాజిక సామరస్యం, టెర్రరిజంపై పోరాటం వంటి అంశాలపై ఆయనతో చర్చించారు. తాను ఇటీవలే ఇండియాను సందర్శించానని, ఇండియా, ఈజిప్టు ప్రజల మధ్య బలమైన సాంస్కృతిక, వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా గ్రాండ్ ముఫ్తీ తెలిపారు. ఇండియా లాంటి పెద్ద దేశానికి మోదీ లాంటి తెలివైన నాయకుడు ఉండటంతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. 

ప్రముఖులతో చర్చలు 

ప్రధాని మోదీ ఈజిప్టు ప్రముఖులు, మేధావులతో సమావేశమయ్యారు. ఈజిప్టు మేధావి, పెట్రోలియం స్ట్రాటజిస్ట్ తరెక్ హెగ్గీ, హసన్ ఆలం హోల్డింగ్ కంపెనీ సీఈవో హసన్ ఆలం, ఇతర ప్రముఖులతో శనివారం సమావేశం అయ్యానని మోదీ ట్వీట్ చేశారు. ఈజిప్టులో యోగా వ్యాప్తికి కృషి చేస్తున్న యోగా ఇన్ స్ట్రక్టర్లు రీమ్ జబక్, నదా అదెల్ కూడా కలిశానని మోదీ పేర్కొన్నారు. ఇండియాకు రావాలని వారిద్దరినీ ఆహ్వానించినట్లు తెలిపారు. కాగా, ఈజిప్టులో రెండు రోజుల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు.

గిజా పిరమిడ్, వెయ్యేండ్ల నాటి మసీదు సందర్శన  

ఈజిప్టు రాజధాని కైరో శివారులో నైలు నది తీరంలో ఉన్న మూడు గిజా పిరమిడ్లను ప్రధాని మోదీ శనివారం సందర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా గురించి ఈ సందర్భంగా ఈజిప్టు ప్రధాని మొస్తఫా ఆయనకు వివరించారు. ఫారో ఖుఫూ సమాధితో కూడిన ఈ పిరమిడ్ ను క్రీస్తుపూర్వం 26వ శతాబ్దంలో 27 ఏండ్ల పాటు నిర్మించారని, ప్రపంచంలోని పురాతన ఏడు వింతల్లో ఇది కూడా ఒకటని తెలిపారు. ప్రపంచ వింతల్లో చెక్కుచెదరకుండా ఉన్నది ఇదొక్కటేనన్నారు.

అలాగే, కైరోలోని 11వ శతాబ్దానికి చెందిన చరిత్రాత్మక అల్ హకీం మసీదును మోదీ ఆదివారం సందర్శించారు. గుజరాత్ తో బలమైన సంబంధాలు ఉన్న దావూదీ బోరా కమ్యూనిటీ ప్రజలు ఈ మసీదును ఇటీవల పునరుద్ధరించారు. మసీదు నిర్మాణం అద్భుతంగా ఉందని, వెయ్యేండ్ల నాటి ఈ మసీదును సందర్శించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా బోరా కమ్యూనిటీ నేతలు మోదీని కలిశారు. కాగా, బోరా తెగ ముస్లింలు గుజరాత్ లో పెద్ద మొత్తంలో ఉన్నారు. ప్రధాని కాకముందు నుంచే ఆ తెగ ముస్లింలతో మోదీకి మంచి సంబంధాలు ఉన్నాయి.    

ఇండియన్ అమరవీరులకు నివాళులు

మొదటి ప్రపంచయుద్ధంలో కామన్వెల్త్ బలగాల తరఫున వీరోచితంగా పోరాడి ఈజిప్టు, పాలస్తీనాలో అమరులైన 4,300 మంది ఇండియన్ సోల్జర్లకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. కైరోలోని హెలియపొలిస్ కామన్వెల్త్ వార్ సిమెటరీని ప్రధాని ఆదివారం సందర్శించారు. విజిటర్స్ బుక్​లో సంతకం చేసి, అమరవీరుల స్మారకం వద్ద పుష్పాలు ఉంచి నివాళులు అర్పించారు.    

మోదీ.. మీరు ఇండియా హీరో.. 

ఈజిప్టులోని ఇండియన్ కమ్యూనిటీ ప్రజలు ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనను ‘ఇండియా హీరో’ అంటూ ప్రశంసించారు. అయితే, ఇండియా విజయం వెనక ప్రతి ఒక్కరి కృషి ఉందని మోదీ అన్నారు. దేశ ప్రజలతో పాటు విదేశాల్లోని భారతీయుల తోడ్పాటుతోనే దేశం ముందుకు వెళ్తోందన్నారు. అందరికీ హిందూస్తానే హీరో అని అన్నారు. శనివారం కైరోలోని రిట్జ్ కార్ల్ టన్ హోటల్లో భారత సంతతి ప్రజలతో మోదీ సమావేశమయ్యారు. మోదీ, మోదీ.. వందేమాతరం అంటూ స్లోగన్స్ ఇస్తూ ప్రధానికి వారు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జెనా అనే ఈజిప్టు మహిళ చీరకట్టుతో వచ్చి.. షోలే సినిమాలోని ‘యే దోస్తీ హమ్ నహీ తోడేంగే’ పాటను పాడుతూ మోదీకి విషెస్ చెప్పారు. తనకు హిందీ పెద్దగా రాదని, ఇండియాకు ఒక్కసారి కూడా రాలేదన్నారు. దీంతో ప్రధాని సర్ ప్రైజ్ అయ్యారు. ‘‘మీరు ఈజిప్టు బిడ్డనా? ఇండియా బిడ్డనా? చెప్పలేకపోతున్నా” అని కామెంట్ చేశారు.