ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌ను బర్తరఫ్ చేయాలి..విద్యార్థి సంఘాల ‘ఛలో లోక్ భవన్’ ఉద్రిక్తం 

ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌ను బర్తరఫ్ చేయాలి..విద్యార్థి సంఘాల ‘ఛలో లోక్ భవన్’ ఉద్రిక్తం 

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దమనకాండను నిరసిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు బుధవారం నిర్వహించిన 'ఛలో లోక్ భవన్' ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, ఏఐఎఫ్ డీఎస్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి లోక్ భవన్ వైపు శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

వారిని బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థి నేతలకు స్వల్పంగా గాయాలయ్యాయి. అరెస్టు చేసిన వారందరినీ ఆసిఫ్‌‌‌‌‌‌‌‌నగర్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.  దేశంలో విద్యార్థులు, యువత రక్తం చూడటమేనా దేశభక్తి అని ప్రశ్నించారు. ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ చేపట్టిన వారిపై లాఠీచార్జి చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం దారుణమన్నారు.

ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న వారిని అణచివేయడం బ్రిటీష్ పాలనను తలపిస్తోందని విమర్శించారు.  కార్యక్రమంలో   విద్యార్థి సంఘాల నేతలు టి.నాగరాజు(ఎస్ఎఫ్ఐ), పుట్టా లక్ష్మణ్ (ఏఐఎస్ఎఫ్​), ఎస్. అనిల్ (పీడీఎస్​యూ), గడ్డం నాగార్జున (ఏఐఎఫ్​డీఎస్​)  , సంఘాల నేతలు మణికంఠ రెడ్డి, అశోక్ రెడ్డి, పల్లె మురళి, లెనిన్ గువేరా, ప్రవీణ్, అర్జున్, భరత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.