ఉన్న ఒక్క టీచర్ నూ బదిలీ​ చేసిన్రు

ఉన్న ఒక్క టీచర్ నూ బదిలీ​ చేసిన్రు
  • 9 మంది పోతుంటే.. ఆరుగురే వచ్చిన్రు
  • జిల్లాల్లో విద్యార్థుల ఆందోళన

జమ్మికుంట/వీణవంక:   ఉన్న ఒక్క టీచర్​వెళ్లిపోతే ఇక తమ పిల్లలకు పాఠాలు ఎవరు చెబుతారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లన్నపల్లి గ్రామంలోని గవర్నమెంట్​ప్రైమరీ స్కూల్​కు ఆరేళ్ల క్రితం డిప్యుటేషన్ పై బొంతుపల్లి ప్రభుత్వ బడి నుంచి రమేశ్ అనే టీచర్​ను పంపించారు. స్టూడెంట్లు లేక మూసివేసిన స్కూల్​ను రమేశ్​గ్రామస్తులతో కలిసి తిరిగి ప్రారంభించారు. గ్రామంలోని పిల్లలు ఇతర స్కూళ్లకు వెళ్లకుండా సర్కారు బడికి వచ్చేలా చూశారు. అలా ఆరుగురితో తిరిగి మొదలైన స్కూల్​లో ప్రస్తుతం 34 మంది స్టూడెంట్లు ఉన్నారు. ఒక్క టీచరే ఉండడంతో స్టూడెంట్ల తల్లిదండ్రులంతా కలిసి  ఓ విద్యా వాలంటీర్​ను నియమించారు. ఆరేండ్లుగా అంతా సాఫీగా సాగుతోంది.

ఇటీవల టీచర్ల బదిలీల సందర్భంగా ఇక్కడ డిప్యుటేషన్ పై పని చేస్తున్న రమేశ్​ను ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాకు బదిలీ చేసింది. దీంతో స్టూడెంట్ల పరిస్థితి గందరగోళంగా మారింది. శాశ్వత టీచర్లను నియమించాలని తాము కోరుతుంటే ఉన్న ఒక్కర్నీ ఎలా బదిలీ చేస్తారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మల్లన్నపల్లి గ్రామ బడికి టీచర్లను నియమించాలని కోరుతున్నారు. టీచర్​ను నియమించకుంటే జిల్లా విద్యా శాఖ ఆఫీస్​ఎదుట గ్రామస్తులతో కలిసి ధర్నా చేస్తామని సర్పంచ్​విజయకుమార్​రెడ్డి చెప్పారు. 
స్టూడెంట్ల రాస్తారోకో
జన్నారం, వెలుగు: బదిలీ అయిన టీచర్ల స్థానంలో కొత్తవారిని నియమించాలని డిమాండ్​ చేస్తూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్​గవర్నమెంట్​ స్కూల్​ స్టూడెంట్లు రాస్తారోకో చేశారు. స్కూల్​లో 650 మంది స్టూడెంట్లకు 17 మంది టీచర్లు ఉన్నారు. వీరిలో 9 మందిని ఇటీవల బదిలీ చేయగా కొత్తగా ఆరుగురిని మాత్రమే ఇచ్చారు. దీంతో స్టూడెంట్లు రేండ్లగూడ మెయిన్​రోడ్డుపై ధర్నాకు దిగారు. వీరికి కిష్టాపూర్​గ్రామ పెద్దలు, ఎన్ఎస్ యూఐ లీడర్లు మద్దతు పలికారు. రెండు గంటలపాటు రాస్తారోకో చేయడంతో కిలోమీటర్​పొడవునా వెహికల్స్​నిలిచిపోయాయి. ఎస్సై మధుసూదన్​రావు, ఎంఈవో విజయ్​కుమార్​అక్కడికి చేరుకుని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.