అబిడ్స్, వెలుగు: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లో గరిష్ట వయోపరిమితిని 34 ఏండ్లుగా నిర్ణయించడంపై రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జేఏసీ చైర్మన్ డాక్టర్ కోటూరి మానవతారాయ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం మంగళవారం టీజీపీఎస్సీసెక్రటరీ ఎం. హరితను కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ.. గతంలో జీవో నంబర్ 30 ద్వారా వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచిన ప్రభుత్వం, ఆ గడువు ముగిసిందనే సాకుతో ప్రస్తుత నోటిఫికేషన్లో మళ్లీ పాత నిబంధనలను అమలు చేయడం వల్ల వేలాది మంది అభ్యర్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ వల్ల ఏర్పడిన జాప్యం, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గరిష్ట వయోపరిమితిని 46 ఏండ్లకు పొడిగించాలని డిమాండ్ చేశారు.

