- సమాజానికి పనికొచ్చేలా వర్సిటీల్లో రీసెర్చ్ ఉండాలి
- టెక్నాలజీని వాడుకోకుంటే వెనుకబడిపోతమని కామెంట్
- ఓయూలో ముగిసిన సెంట్రల్ జోన్ వీసీల కాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు: ప్రపంచం టెక్నాలజీతో శరవేగంగా మారుతోందని, ఆ వేగాన్ని అందుకోవాలంటే మన విద్యావ్యవస్థ కూడా ఆధునికత వైపు మళ్లాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. క్యాంపస్‌ల నుంచి వచ్చే స్టూడెంట్లు డిగ్రీలు పట్టుకుని ఉద్యోగాల కోసం వెతికేటోళ్లుగా కాకుండా.. నలుగురికి ఉపాధి కల్పించే జాబ్ క్రియేటర్లుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
ఓయూలో రెండు రోజుల పాటు నిర్వహించిన అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీలు భవిష్యత్తులో పరిశ్రమల స్వరూపాన్నే మార్చేస్తాయని అన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో జరిగే పరిశోధనలు ఏదో మొక్కుబడిగా కాకుండా.. సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపేలా ఉండాలన్నారు.
అప్పుడే చదువుకు సార్థకత అని స్పష్టం చేశారు. టెక్నాలజీని వాడుకోకుంటే వెనుకపడి పోతామన్నారు. పాలనలో తనకున్న అనుభవాన్ని వివరిస్తూ.. సాంకేతికత ప్రభావం ఎంతలా ఉందో ఉదాహరణలతో జయేశ్ వివరించారు.
వీసీలు ఆఫీసర్లే కాదు.. లీడర్లు: మోహన్ రెడ్డి
వర్సిటీల పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వాడుతున్నప్పుడు అది పూర్తిగా ‘హ్యూమన్ సెంట్రిక్’గా ఉండాలని పారిశ్రామికవేత్త బీవీఆర్ మోహన్ రెడ్డి అన్నారు. వైస్-ఛాన్సలర్లు కేవలం నిర్వాహకులుగా కాకుండా పరివర్తనకు మార్గదర్శకులుగా మారి దేశ విద్యా భవిష్యత్తును దిశానిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు. వైస్ ఛాన్సలర్లు అంటే కేవలం యూనివర్సిటీని నడిపే అడ్మినిస్ట్రేటర్లు మాత్రమే కాదని, వాళ్లు విద్యావ్యవస్థలో ‘మార్పును నడిపించే డ్రైవర్లు’ కావాలని కోరారు. దేశంలో చదువుల భవిష్యత్తు ఎటు పోవాలనేది డిసైడ్ చేసి, గైడ్ చేయాల్సింది వాళ్లేనని చెప్పారు.
టెక్నాలజీలో ‘ఎథిక్స్’ మస్ట్: ఐఐఐటీ డైరెక్టర్ సందీప్
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందనీ, కానీ ఆ డెవలప్‌మెంట్ అంతా బాధ్యతతో కూడి ఉండాలని ఐఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ సందీప్ శుక్లా అన్నారు. టెక్నాలజీ డెవలప్‌మెంట్ వెనక కచ్చితమైన నైతిక విలువలు, గ్లోబల్ స్టాండర్డ్స్ పాటించడమనేది చాలా ముఖ్యమని వెల్లడించారు. ఓయూ వీసీ కుమార్ మొలుగరం మాట్లాడుతూ.. ఏఐ మౌలిక సదుపాయాలు, క్వాంటం రీసెర్చ్‌పై జరిగిన చర్చలు భవిష్యత్ కార్యాచరణకు పునాది వేస్తాయని అన్నారు.
నాలుగో పారిశ్రామిక విప్లవ సవాళ్లను ఎదుర్కోవడానికి వర్సిటీల మధ్య పరస్పర సహకారం అవసరమని చెప్పారు. దేశంలోని మేధావులందరికీ ఆతిథ్యం ఇవ్వడం ఓయూకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఏఐయూ సెక్రటరీ జనరల్ పంకజ్ మిట్టల్, జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఉన్నత విద్యా సంస్థల్లో ‘ఏఐ, క్వాంటం టెక్నాలజీ’ అమలు దిశగా రెండు రోజుల పాటు జరిగిన సమీక్షల సారాంశాన్ని ఒక నివేదిక రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.
