- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ముషీరాబాద్, గండిపేట, వెలుగు: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్ప విజయాలు సాధించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ హై స్కూల్ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేశారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులు తయారు చేసిన 70కి పైగా వివిధ నమూనా ప్రాజెక్ట్స్ ను ఎంపీ గడ్డం వంశీకృష్ణ తిలకించారు.
విద్యార్థుల నుంచి అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులు టెక్నికల్ గా ఆలోచించి ప్రాజెక్టులు చేయడం సంతోషకరమని ఇదే చురుకుదనంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రిన్సిపాల్ విఠలాచారి, మేరి, బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా వంశీకృష్ణ
విద్యార్థులు చక్కగా చదువుకుంటూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. బండ్లగూడ సన్‌సిటీలోని గ్లెన్‌డేల్ అకాడమీ ఇంటర్ నేషనల్ స్కూల్ 23వ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులను లీడర్లుగా తీర్చిదిద్దుతున్న గ్లెన్‌డేల్ 7 హ్యాబిట్స్ ప్రోగ్రామ్ అద్భుతమని ప్రశంసించారు.
స్టీఫెన్ కోవీ 7 హ్యాబిట్స్‌ను పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చి పిల్లలను చిన్న వయస్సులోనే లీడర్లుగా మార్చడం ఎంతో గొప్పవిషయమని కితాబిచ్చారు. నేటి విద్యార్థులే రేపటి లీడర్లు అని పేర్కొన్నారు. ఇలాంటి విద్యా విధానం మిగిలిన పాఠశాలలకు కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
