
హైదరాబాద్, వెలుగు: బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా సూదగాని హరిశంకర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ బేగంపేట్‌లోని హోటల్ టూరిజం ప్లాజాలో ఆదివారం జరిగిన బీసీ జేఏసీ కోర్ గ్రూప్ సమావేశంలో బీసీ నాయకులు ఆయన్ను ఎన్నుకున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలోని బీసీ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, రచయితలు, విద్యార్థి, మహిళ, ఉపాధ్యాయ, ఉద్యోగ, ఆర్టీసీ, సింగరేణి వంటి వివిధ వర్గాల ప్రతినిధులు రాష్ట్రంలో బీసీల ఐక్యత కోసం కృషి చేయాలని నిర్ణయించారు.
న్యూస్ పేపర్‌లలో సగం పేజీ బీసీలది అయినప్పుడే రాజ్యాధికారం వస్తుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీలందరినీ కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణలో బీసీ ఉద్యమం బలోపేతమైందని ఉద్యమకారుడు వి.ప్రకాశ్ అన్నారు. రాబోయే రోజులు బీసీలవే అని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. రాజకీయ ఉద్యమాన్ని కచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి ఒక్క బీసీని కదిలించాల్సిన సమయం వచ్చిందని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. జేఏసీ కార్యకలాపాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు తమవంతు కృషి చేస్తామని సమావేశానికి హాజరైన బీసీ ప్రొఫెసర్లు, ఉద్యోగ సంఘాల నేతలు హామీ ఇచ్చారు.