V6 News

సమ్మర్ క్యాంపుల రిజిస్ట్రేషన్లేవి?...ఈ ఏడాది అసలు ఉంటాయా? ఉండవా?

సమ్మర్ క్యాంపుల రిజిస్ట్రేషన్లేవి?...ఈ ఏడాది అసలు ఉంటాయా? ఉండవా?
  • మూడు కార్పొరేషన్ల పరిధిలో  ఓపెన్ కాని రిజిస్ట్రేషన్లు 
  • ఏటా 15 రోజుల ముందే అప్లికేషన్ల సేకరణ
  • ఈసారి అధికారులనిర్లక్ష్యంతోనే ఆలస్యం
  • ఇప్పటికే కొన్ని స్కూళ్లకు హాలిడేస్  
  • ఈ నెల 25 నుంచి అన్ని విద్యాసంస్థలకు సెలవులు
  • అయోమయంలో పిల్లల తల్లిదండ్రులు

 హైదరాబాద్ సిటీ, వెలుగు:  సమ్మర్ క్యాంపుల విషయంలో మూడు కార్పొరేషన్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నెల 25 నుంచి సమ్మర్ క్యాంపులు మొదలవుతాయని ప్రకటించిన అధికారులు.. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్​ప్రక్రియను స్టార్ట్​చేయలేదు. కొద్ది రోజుల కిందటే కొన్ని స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వగా, ఈ నెల 25 నుంచి అన్ని విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వెబ్​సైట్స్​ను విజిట్​చేస్తున్న పేరెంట్స్​అవి ఓపెన్​కాకపోవడంతో ఈసారి క్యాంప్స్​ఎత్తేశారేమోనని అనుకుంటున్నారు. 

ప్రతిసారి 15 రోజుల ముందే

ఏటా సమ్మర్​క్యాంపుల కోసం15 రోజుల ముందే ఆన్​లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకునేవారు. గతంలో పాత జీహెచ్ఎంసీ ఉన్నప్పుడు స్పోర్ట్స్ అడిషనల్ కమిషనర్, స్పోర్ట్స్ డైరెక్టర్లు జోనల్ అధికారులతో కో ఆర్డినేట్​చేస్తూ క్యాంపులు నిర్వహించేవారు. కానీ, కార్పొరేషన్లు వేరయ్యాక పట్టించుకునేవారు కరువయ్యారు. మంగళవారం వరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో వెబ్​సైట్లు ఓపెన్ చేసి చూస్తే స్పోర్ట్స్​విభాగంలో రిజిస్ట్రేషన్ కోసం చూస్తే కనిపించడం లేదు. 

ప్రస్తుతం మూడు కార్పొరేషన్లలో స్పోర్ట్స్ విభాగానికి ప్రత్యేకంగా అడిషనల్ కమిషనర్​అంటూ ఎవరూ లేరు. జీహెచ్ఎంసీకి మాత్రమే స్పోర్ట్స్ డైరెక్టర్ ఉన్నారు. ఇక ఎంఎంసీ, సీఎంసీలకు స్పోర్ట్స్ డైరెక్టర్లు కూడా లేరు. చిన్న కేడర్ అధికారులే సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. 

వేలామంది ఎదురుచూపు...

మూడు కార్పొరేషన్ల పరిధిలో నిర్వహించే సమ్మర్​క్యాంపులకు దాదాపు లక్ష మందికి పైగా వినియోగించుకుంటారనేది ఓ అంచనా. దీని కోసం మూడు కార్పొరేషన్లు కలిపి రూ.2.50 కోట్లు ఖర్చు చేయనున్నాయి. అయితే, మూడు రోజుల్లో క్యాంపులు మొదలుకానుండగా, ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాశకు లోనవుతున్నారు. అసలు ఈ ఏడాది క్యాంపులు ఉంటాయా? లేదా? అన్న అయోమయంలో ఉన్నారు. సమ్మర్​కోచింగ్​కోసం బయట చేర్పిస్త ఏదయినా నెలకి రూ.2వేలకు తక్కువ లేదు. 

అదే జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, ఎంఎంసీ అయితే, నామమాత్రంగా రూ.10, రూ.50, చెల్లిస్తే చాలు.. కానీ, సమయం మించిపోతున్నా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  అలాగే మూడు రోజుల్లో సమ్మర్​క్యాంపులు మొదలుకానున్నా ఇప్పటివరకు మెటీరియల్​కొనుగోలుకు సంబంధించి టెండర్లు పూర్తికాలేదు. ఈ క్రమంలో క్యాంపులు ప్రారంభమైతే పాత మెటీరియల్​తోనే కోచ్​లు అడ్జస్ట్​చేసుకోవాల్సి ఉంటుంది.  

ఐదు క్రీడలకు రూ. 50, మిగతా అన్నింటికి రూ.10

సమ్మర్ క్యాంపుల్లో అథ్లెటిక్స్, ఆర్చరీ, బాల్ బాడ్మింటన్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాక్సింగ్, క్రికెట్, చెస్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్, హాకీ, హ్యాండ్ బాల్, జూడో, కరాటే, కబడ్డీ, ఖోఖో, కార్ఫ్ బాల్, మాల్ కంబా, నెట్ బాల్, రోలర్ స్కేటింగ్, సాఫ్ట్ బాల్, సెపక్ తక్రా, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టెన్నికాయిట్, తైక్వాండో, టగ్​ఆఫ్​వార్​, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్​ఇండియన్, రెజ్లింగ్​రోమన్, ఉషు, యోగా, త్రో బాల్, కిక్ బాక్సింగ్, మువ్​థాయ్, స్కే మార్షల్ ఆర్ట్స్, మినీ ఫుట్ బాల్, క్యారమ్స్ లో కోచింగ్ ఇవ్వనున్నారు. 

ఇందులో షటిల్, బ్యాడ్మింటన్, రోలర్ స్కేటింగ్, క్రికెట్, టెన్నిస్ కు రూ. 50,  మిగతా వాటికి రూ.10 ఫీ చెల్లించాల్సి ఉంటుంది. సమ్మర్ క్యాంపులో స్విమ్మింగ్ కి శిక్షణ ఇవ్వడం లేదు. స్విమ్మింగ్​నేర్చుకోవాలనుకుంటే రూ.500 కట్టాలి.