Kohli: సచిన్ రికార్డును బద్దలు కొట్టే సత్తా కోహ్లీకే ఉంది

Kohli: సచిన్ రికార్డును బద్దలు కొట్టే సత్తా కోహ్లీకే ఉంది

విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ వంద సెంచరీల రికార్డును బద్దలుకొట్టే సత్తా కోహ్లీకి మాత్రమే ఉందన్నాడు. కోహ్లీ వంద సెంచరీలు చేస్తాడా లేదా అనే అనుమానమే వద్దని..ఖచ్చితంగా విరాట్ కోహ్లీ వంద సెంచరీలు చేసి తీరుతాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 34 ఏళ్ల కోహ్లీ మరో నాలుగైదేళ్లు క్రికెట్ ఆడగలడని..ఏడాదికి  6 లేదా 7 సెంచరీలు బాదితే ..కోహ్లీ వంద సెంచరీలు ఘనత ఈజీగా సాధిస్తాడన్న నమ్మకాన్ని వెలిబుచ్చాడు. సచిన్ 40 వయసు వచ్చే వరకు క్రికెట్ ఆడాడని..శంద శతకాల రికార్డును అందుకోవాలంటే కోహ్లీ కూడా 40 ఏండ్ల వరకు ఆడాలన్నాడు. ఫిట్ నెస్ విషయంలో కోహ్లీ స్పష్టంగా ఉంటాడని..ఈ లెక్కన శత శతకాలు సాధించడం కోహ్లీకి పెద్ద కష్టమేమి కాకపోవచ్చని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. 

 
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు సాధించాడు. మొదటి వన్డేలో శతకం బాదగా..చివరి వన్డేలో భారీ సెంచరీ కొట్టాడు. వీటితో అన్ని ఫార్మాట్లలో కలిపి  తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్య 74కు చేరుకుంది.  ఈ సెంచరీలతో వన్డేల సెంచరీల సంఖ్య 46కు చేరుకుంది. వన్డేల్లో సచిన్‌ టెండూల్కర్ 49 శతకాలు బాదాడు. దీంతో వన్డేల సెంచరీల రికార్డుకు కేవలం మూడు సెంచరీల దూరంలో నిలిచాడు. ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్‌ 2023, వన్డే ప్రపంచకప్‌ 2023 వంటి ఐసీసీ టోర్నీలతో పాటు..ఇతర వన్డే సిరీస్ లు ఉన్నాయి.  కోహ్లీ ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తే మాత్రం..వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం ఈజీ. అయితే సచిన్‌ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును అధిగమించాలంటే మాత్రం కోహ్లీ ఇంకో  మూడు, నాలుగేళ్లు ఆగకతప్పదు.