సజ్జల వ్యాఖ్యలకు ఏపీ కాంగ్రెస్ కౌంటర్

సజ్జల వ్యాఖ్యలకు ఏపీ కాంగ్రెస్ కౌంటర్

వైఎస్ షర్మిల  ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు సిద్ధమవుతున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  సజ్జల వ్యాఖ్యలపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. అధికారం కోల్పోతున్నామని భయంతో సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికార దాహంతో గత ఎన్నికల సమయంలో రాజశేఖర్ రెడ్డి మరణాన్ని వాడుకుని ప్రజల ముందుకు వచ్చాడు .. తప్పుడు ప్రచారాలుచేసి అసత్యాలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేశారని సుంకర పద్మశ్రీ విమర్శించారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై అనుమానాలు ఉంటే అధికారంలోఉన్న నాలుగున్నర సంవత్సరాలుగా ఏం చేశారు?, విచారణ ఎందుకు చేయలేదు? అంటూ సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని గౌరవించి పార్టీలోకి వచ్చారని, రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆఖరి కోరిక అనే విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు షర్మిల వచ్చారని అన్నారు. షర్మిలను చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు, జగన్ మోహన్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. ఒక్క చాన్స్ అంటే రాష్ట్ర ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారు.. ఇప్పుడు ఎందుకు అవకాశం ఇచ్చామా అని బాధపడుతున్నారని సుంకర పద్మశ్రీ తెలిపారు.

 షర్మిల పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకుంటే సజ్జలతో జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడించాడని అన్నారు. ప్రజాసేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే ఆమెను చూసి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు భయపడుతున్నారు.. అందుకే మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైయస్సార్ మరణాన్ని వాడుకుని కాంగ్రెస్ పార్టీపై బురద చల్లేందుకు చూస్తున్నారని విమర్శించారు.

వైయస్సార్సీపి నాయకులు కాంగ్రెస్ నుకానీ, గాంధీ కుటుంబాన్నికానీ విమర్శిస్తే ఊరుకునేది లేదని సుంకర పద్మశ్రీ హెచ్చరించారు. ఎన్ని విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడులాగా, టీడీపీ నేతల్లా చూస్తూ ఊరుకోమన్నారు. తప్పుడు ప్రచారంచేస్తే ఇంటికొచ్చి మరి కొడతామని  హెచ్చరించారు.  వైయస్సార్ పేరు జగన్ సర్వనాశనం చేశాడు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు నిజమైన వారసులు కాంగ్రెస్ వాదులే. రాజశేఖర్ రెడ్డి ఆస్తులకే జగన్మోహన్ రెడ్డి వారసుడని సుంకర పద్మశ్రీ అన్నారు.