ఈవీలకు బ్యాటరీ దెబ్బ!

ఈవీలకు బ్యాటరీ దెబ్బ!
  • తగ్గిన లిథియం అయాన్  బ్యాటరీల సప్లయ్‌‌‌‌
  • పెరుగుతున్న రవాణా ఖర్చులు, బ్యాటరీల ధరలు 
  • ఖరీదు కానున్న ఈవీలు

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆటో కంపెనీలకు ఈ దీపావళి కలిసొచ్చినట్టు లేదు. పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్ బండ్లను తయారు చేస్తున్న కంపెనీలను చిప్‌‌‌‌‌‌‌‌ల కొరత వెంటాడుతునే ఉండగా, ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌(ఈవీ) కంపెనీలకు బ్యాటరీల కొరత ఇబ్బంది పెడుతోంది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా లిథియం అయాన్ బ్యాటరీల  
సప్లయ్‌‌‌‌‌‌‌‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో డిమాండ్‌‌‌‌‌‌‌‌కు తగ్గ సప్లయ్ జరగడం లేదు. దీనికి తోడు ఈ బ్యాటరీలను తయారు చేస్తున్న కంపెనీలు ఇండియా కంటే యూఎస్, పశ్చిమ యూరప్ దేశాలకు  ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీనికికారణం లేకపోలేదు. ఇండియాలో ఈవీ వెహికల్స్ వాటా ఇప్పటికీ చాలా తక్కువ. దీంతో ఎక్కువగా వాల్యూమ్స్‌‌‌‌‌‌‌‌ను ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్న దేశాల వైపు బ్యాటరీ తయారీ కంపెనీలు చూస్తున్నాయి. 
డిమాండ్ జూమ్‌‌‌‌‌‌‌‌ జూమ్‌‌‌‌‌‌‌‌..
లిథియం అయాన్ బ్యాటరీలకు గ్లోబల్‌‌గా డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్‌‌కు తగ్గ సప్లయ్‌‌ లేదు. పశ్చిమ యూరప్ దేశాల్లో, యూఎస్‌‌‌‌‌‌‌‌లో ఈవీ మార్కెట్‌‌ పెరుగుతోంది.  ఈ అంశాలకు తోడు చైనా పవర్ షార్టేజ్‌‌తో  లిథియం బ్యాటరీల సప్లయ్‌‌లో  ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చైనాలో లిథియం  నిల్వలు ఎక్కువ. లిథియం అయాన్‌‌ బ్యాటరీలను ఈ దేశమే ఎక్కువగా సప్లయ్ చైస్తోంది. పవర్ షార్టేజ్ వలన ఈ దేశంలోని కంపెనీ పూర్తి స్థాయి కెపాసిటీతో పనిచేయడం లేదు. సౌత్ కొరియా, తైవాన్ దేశాలతో పాటు చైనా నుంచి  మనం పెద్ద మొత్తంలో లిథియం అయాన్ బ్యాటరీలను దిగుమతి చేసుకుంటున్నాం. కిందటి నెలలో చైనా నుంచి రావాల్సిన బ్యాటరీ పార్టులు ఈ నెలలో వచ్చాయని ట్రోంటెక్‌‌‌‌‌‌‌‌  ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌ సీఈఓ సామ్రాట్‌‌‌‌‌‌‌‌ కొచ్చర్ అన్నారు. షిప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లు 10–15 రోజులు ఆలస్యంగా రావడం సాధారణమయ్యిందని చెప్పారు. ఈ కంపెనీ విదేశాల నుంచి బ్యాటరీ సెల్స్‌‌ను దిగుమతి చేసుకోని వాటిని  అసెంబుల్ చేసి ఈవీ కంపెనీలకు సేల్ చేస్తోంది.   
బ్యాటరీల దిగుమతులు రూ.9 వేల కోట్లకు..
 సప్లయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడిన ప్రతీసారి బ్యాటరీ ధరలు మారుతూ వచ్చాయని ఈవీ బైక్‌‌‌‌‌‌‌‌లను తయారు చేసే కంపెనీ వన్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ సీఈఓ గౌరవ్ ఉప్పల్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. దేశంలోని ఈవీ తయారీ కంపెనీలన్నీ  ఒక కన్సార్షియంగా ఏర్పడి, పెద్ద మొత్తంలో ఆర్డర్లు పెట్టాలని సలహాయిచ్చారు. లేకపోతే ఎక్కువగా ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ వచ్చే దేశాలకు సప్లయ్‌‌‌‌‌‌‌‌ వెళ్లిపోతుందని  అన్నారు. నాన్ చైనీస్‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఒకటి ఇండియాకు సప్లయ్ చేయాల్సిన బ్యాటరీలను హోల్డ్‌‌‌‌‌‌‌‌లో పెట్టి, అమెరికాకు పంపుతోందని సంబంధిత వ్యక్తి ఒకరు పేర్కొన్నారు. బ్యాటరీ సెల్స్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ పెరిగి, ప్రస్తుత పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకోవడానికి ఇంకో 15–24 నెలల టైమ్ పడుతుందని నిపుణులు అంటున్నారు. బ్యాటరీ సెల్స్‌‌‌‌‌‌‌‌ తయారీని లోకల్‌‌‌‌‌‌‌‌గానే పెంచేందుకు ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్‌‌‌‌‌‌‌‌ ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌ (పీఎల్‌‌‌‌‌‌‌‌ఐ) కింద రాయితీలను ప్రకటించింది. ఈ స్కీమ్ కింద ఐదేళ్లకు గాను రూ. 18,100 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. పీఎల్‌‌‌‌‌‌‌‌ఐకి అప్లయ్ చేసిన కంపెనీలు ఏర్పాటు కావడానికి, ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి టైమ్‌‌‌‌‌‌‌‌ పడుతుంది. అప్పటి వరకు  ఈవీ తయారీ కంపెనీలు బ్యాటరీల కోసం దిగుమతుల పై ఆధారపడక తప్పదు. 2020–21  లో రూ. 9 వేల కోట్ల విలువైన లిథియం అయాన్‌‌‌‌‌‌‌‌ సెల్స్‌‌‌‌‌‌‌‌ను  మనం  దిగుమతి చేసుకున్నాం.

ధరలు పెరుగుతున్నయ్‌‌‌‌..
సప్లయ్ తక్కువగా ఉండడంతో లిథియం అయాన్ బ్యాటరీ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గ్రేడ్ లిథియం కార్బొనేట్‌‌‌‌ ధరలు కిందటి రెండు నెలల్లో 27 శాతం పెరిగి ఆల్‌‌‌‌ టైమ్ హైకి చేరుకున్నాయి. వీటి రవాణా ఖర్చులు  కూడా పెరుగుతున్నాయి. చైనా నుంచి వచ్చే షిప్‌‌‌‌మెంట్ల రవాణా ఖర్చు గత ఏడాదితో పోలిస్తే  ఈ సారి నాలుగు రెట్లు పెరిగింది. కొన్ని కంపెనీలు బ్యాటరీ షార్టేజ్‌‌‌‌ లేకుండా చూసుకోవడానికి విమానాల ద్వారా సప్లయ్‌‌‌‌ను తెచ్చుకుంటున్నాయి. బ్యాటరీ ధరలు, రవాణా ఖర్చులు పెరుగుతుండడంతో ఈవీ తయారీ కంపెనీలపై అదనపు భారం  పడుతోంది. ట్రోంటెక్‌‌‌‌ బ్యాటరీ ధరలను 5 శాతం మేర పెంచింది. ధరలు ఇంకా పెరగొచ్చని కూడా చెబుతోంది.