హుస్సేన్ సాగర్ భూవివాదం కేసు మే19 కి వాయిదా

హుస్సేన్ సాగర్ భూవివాదం కేసు మే19 కి వాయిదా
  • అదేరోజు సుదీర్ఘ వాదనలు వింటామన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: హుస్సేన్ సాగర్ పరిధిలోని సుమారు 19.23 ఎకరాల భూమి తమదేనంటూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై ఈనెల 19న సుదీర్ఘ వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. హుస్సేన్ సాగర్ పరిధిలోని వివాదాస్పద భూమి తమదంటూ విజయ రెడ్డి, మరికొందరు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ భూవివాదంపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సుప్రీంకోర్టులో నాలుగు స్పెషల్ లీవ్ పిటిషన్లను దాఖలు చేసింది. శుక్రవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది.

హెచ్ఎండీఏ తరఫు సీనియర్ అడ్వకేట్ గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ ఈ భూ వివాదంలో 1983లోనే మూడు సివిల్ సూట్లు దాఖలయ్యాయని కోర్టుకు నివేదించారు. పట్టా, రెవెన్యూ రికార్డులను బట్టి విజయరెడ్డి తదితరులు హక్కులు కోరుతున్నారని తెలిపారు. ఈ వివాదాస్పద స్థలాన్ని ప్రభుత్వం 'శిఖం' భూమిగా గుర్తించిందని వివరించారు. సిటీ సివిల్ కోర్టులో దాఖలైన రెండు సూట్లను ట్రయల్ కోర్టు కొట్టివేసిందని, అయితే మూడో సూట్‌‌‌‌‌‌‌‌లో ఈ భూమి ప్రభుత్వానిది కాదని తీర్పు వచ్చిందని అగర్వాల్ పేర్కొన్నారు.

దీనిపై తాము దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు తిరస్కరించిందని తెలిపారు. ప్రతివాదుల తరపు న్యాయవాది శ్యామ్ దివాన్ స్పందిస్తూ.. ఈ భూమికి సంబంధించి తమ వద్ద పక్కా పట్టా పత్రాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడిన జస్టిస్ విక్రమ్ నాథ్, పూర్తిస్థాయిలో వాదనలు వినేందుకు విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.