- ఐపీసీ సెక్షన్ 498ఏ కింద రక్షణ పొందొచ్చు: సుప్రీం
న్యూఢిల్లీ: లివ్-ఇన్ రిలేషన్‌లోని మహిళలకు కూడా గృహ హింస, వరకట్న వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 498ఏ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రక్షణ విషయంలో వివాహిత మహిళకు, లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న మహిళకు మధ్య భేదం చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కల్పించిన సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది.
భర్త లేదా బంధువుల వేధింపుల వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా గాయపడటం, ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులను అరికట్టడమే సెక్షన్ 498ఏ ముఖ్య ఉద్దేశమని గుర్తుచేసింది. కర్నాటకకు చెందిన ఓ వ్యక్తిపై అతనితో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న మహిళ గృహహింస ఆరోపణలు చేస్తూ ఐపీసీ సెక్షన్ 498ఏ కింద కేసు పెట్టింది.
అయితే, తమకు చట్టబద్ధంగా వివాహం కాలేదని, సెక్షన్ 498ఏ తనపై వర్తించదని.. కేసును కొట్టివేయాలని కోరుతూ సదరు వ్యక్తి కర్నాటక హైకోర్టును ఆశ్రయించాడు. పెళ్లిలాంటి (లివ్-ఇన్) సంబంధంలో ఉన్నప్పుడు వేధింపులు జరిగినా సెక్షన్ 498ఏ వర్తిస్తుందని కర్నాటక హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్మీకాపమ్ కోటీశ్వర్ సింగ్ బెంచ్ విచారించింది.
అధికారికంగా వివాహం కాకపోయినంత మాత్రాన వేధింపుల తీవ్రత తక్కువైపోదని పేర్కొంటూ కర్నాటక హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించి కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో సాగే రిలేషన్‌కు మాత్రమే సెక్షన్ 498ఏ వర్తిస్తుందని తెలిపింది. ఇది ఇతర చట్టాలను ప్రభావితం చేయదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, లివ్-ఇన్ భాగస్వామిపై ఆరోపణలు వచ్చిన వెంటనే ఎవరినీ అరెస్టు చేయకూడదని, ముందుగా ప్రాథమిక విచారణ జరపాలని కోర్టు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.
ప్రతి రోడ్డుపై పాదచారులకు రక్షిత స్థలం ఉండాలి
దేశంలోని ప్రతి రోడ్డుపై పాదచారుల కోసం ప్రత్యేకంగా గుర్తించిన నడక స్థలాన్ని ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధెలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌ను ఆదేశిస్తూ నడక మార్గాన్ని మోటార్ వాహనాల లేన్ల నుంచి సరిగ్గా వేరు చేయాలని పేర్కొంది.
భారీ నిర్మాణాలు లేకపోయినా, కేవలం తాడు సహాయంతోనైనా సరిహద్దులను గుర్తించి, నడక స్థలాన్ని ఆక్రమణల బారిన పడకుండా కాపాడాలని ధర్మాసనం సూచించింది. పాదచారులు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా నడిచేలా భరోసా కల్పించాలని పేర్కొంటూ, ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవడానికి ఏఎస్జీకి రెండు వారాల గడువు ఇచ్చింది. గతంలో జూన్ 19న వెలువరించిన చరిత్రాత్మక తీర్పులో ఫుట్‌పాత్‌పై నడిచే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(d), ఆర్టికల్ 21 కింద పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మోటార్ వాహనాల రాకపోకల కంటే పాదచారుల నడక హక్కుకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని తేల్చిచెప్పింది. ఐదేండ్ల బాలుడి దుర్మరణానికి సంబంధించిన కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ బాధ్యత పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయతీలదేనని కోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
