
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)కు సంబంధించిన అన్ని విషయాలను గతంలో తాము వేసిన కమిటీనే చూసుకుంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. హెచ్‌సీఏ రోజువారీ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ దీపక్ వర్మ తొలగింపు విషయంలో దాఖలైన పిటిషన్ ను సోమవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉల్లంఘన జరుగుతోందని బడ్డింగ్ స్టార్ క్రికెట్ క్లబ్ తరఫు న్యాయవాది.. బెంచ్‌కు విన్నపించారు. దీనిపై స్పందించిన సీజేఐ.. హెచ్‌సీఏ పర్యవేక్షణ కోసం జస్టిస్ కక్రూ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ వేసినట్లు గుర్తు చేశారు.
ప్రస్తుతం అమలులో కార్యవర్గం తీసుకునే నిర్ణయాలను సమీక్షించే అధికారం జస్టిస్ కక్రూ కమీటికి ఉందన్నారు. కమిటీలోకి జస్టిస్ ఎల్.ఎన్. రావు పేరును చేర్చే అంశాన్ని పరిశీలించాలన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. జస్టిస్ కక్రూ నేతృత్వంలోని కమిటీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, హెచ్ సీఏతో సంబంధం లేని ఇద్దరు, ముగ్గురు ప్లేయర్స్ ను కమిటీలో నియమిస్తామని తేల్చి చెప్పింది. అయితే, సెప్టెంబర్ 25 న ఇండియా – ఆస్ట్రేలియా మధ్య ఇంటర్నేషనల్ మ్యాచ్ ఖరారైందని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సంఘం రోజు వారి వ్యవహారాల్లో జోక్యం చేసుకోమన్న సీజేఐ తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.