ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

 ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఎన్నికల సంఘం (ఈసీఐ)కి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)ల పనితీరును ప్రశ్నించిన వారికి ఆరు నెలల జైలు శిక్ష తప్పదన్న నిబంధనపై దాఖలైన పిటిషన్‌ కు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌ ల మధ్య వ్యత్యాసాలపై వచ్చిన ఫిర్యాదులు నిజం కాదని రుజువైతే ..దాన్ని డైరెక్ట్ గా పరిగణించరాదంటూ పిటిషనర్ కోరారు.

ఎన్నికల కోడ్‌ లోని నిబంధనల్లో సెక్షన్ 49 ఎంఏ ప్రకారం.. ఈవీఎం లోపాలున్నాయంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి, సదరు ఆరోపణలు తప్పని రుజవైతే ఐపీసీ సెక్షణ్ 177 కింద విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ‘‘తప్పుడు సమాచారం ఇచ్చినందుకు’’ ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన వల్ల ఈవీఎంలో ఓటు వేసినప్పుడు ఏదైనా తేడా జరిగినా ఫిర్యాదు చేసేందుకు ఓటరు వెనక్కి తగ్గాల్సి వస్తోందని పిటిషనర్ సునీల్ సుప్రీంకోర్ట్ కు విన్నవించారు.