NCERT పుస్తకం వివాదం.. 8వ తరగతి పుస్తకాల అమ్మకాలు నిలిపివేత

NCERT  పుస్తకం వివాదం.. 8వ తరగతి పుస్తకాల అమ్మకాలు నిలిపివేత
  • వ్యవస్థలను కించపరచడం సహించబోమన్న సీజేఐ 
  • పుస్తకాల అమ్మకాలు నిలిపివేత

న్యూఢిల్లీ: ఎన్సీఈఆర్టీ 8వ తరగతిలోని ఓ అధ్యాయంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశాన్ని చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పాఠం న్యాయ వ్యవస్థ సమగ్రతను కలుషితం చేస్తుందని చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ సూర్యకాంత్‌‌‌‌‌‌‌‌ అభిప్రాయపడ్డారు. అలా జరగడాన్ని దేశంలో ఎవరూ అనుమతించబోరని స్పష్టం చేశారు. ఏ సంస్థనైనా, వ్యక్తినైనా కించపర్చడాన్ని న్యాయ వ్యవస్థ సహించదని హెచ్చరించారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. 

త్వరలోనే ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని కేసు విచారణ చేపడతామని స్పష్టం చేశారు. పాఠ్యాంశంగా చేర్చిన విషయాన్ని సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ కపిల్‌‌‌‌‌‌‌‌ సిబల్‌‌‌‌‌‌‌‌, అభిషేక్‌‌‌‌‌‌‌‌ మను సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకురాగా, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో జస్టిస్‌‌‌‌‌‌‌‌ బాగ్చి, జస్టిస్‌‌‌‌‌‌‌‌ విపుల్‌‌‌‌‌‌‌‌తో కూడిన బెంచ్‌‌‌‌‌‌‌‌ స్పందించింది. ఇది న్యాయమూర్తులందరినీ కలవరానికి గురిచేసిందని సీజేఐ పేర్కొన్నారు.

ఆ పాఠంలో ఏముందంటే.. 

న్యాయమూర్తులు కోర్టు లోపలే కాకుండా బయట సమాజంలో కూడా ఎలా నడుచుకోవాలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశంలో వివరించారు. న్యాయ వ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తన ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని మాజీ సీజేఐ జస్టిస్‌‌‌‌‌‌‌‌ గవాయ్‌‌‌‌‌‌‌‌ పోయినేడాదిలో చేసిన వ్యాఖ్యలను ఆ లెసన్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో అవినీతి, పెద్ద సంఖ్యలో కేసుల పెండిగ్‌‌‌‌‌‌‌‌, కోర్టులలో న్యాయమూర్తుల కొరత వంటి అంశాలనూ ప్రస్తావించారు. కాగా, కోర్టు స్పందనతో ఎన్సీఈఆర్టీ తప్పు సరిదిద్దుకునేందుకు ప్రయత్నించింది. అభ్యంతరకరంగా ఉన్న ఆ అంశాలను పాఠ్యాంశంలోంచి తొలగిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ వివాదంతో 8వ తరగతి పుస్తకాల అమ్మకాలను ఎన్సీఈఆర్టీ నిలిపివేసింది.

న్యాయవ్యవస్థకు అపవాదు

8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి బోధించడం పూర్తి అపవాదును మూటగట్టడమే అవుతుందని కపిల్‌‌‌‌‌‌‌‌ సిబల్‌‌‌‌‌‌‌‌ అన్నారు. న్యాయమూర్తులు కోర్టు లోపల మాత్రమే కాకుండా బయటకూడా ఎలా నడవాలో నీతి, నియమావళి గురించి పాఠ్యాంశంలో వివరించారని పేర్కొన్నారు. అభిషేక్‌‌‌‌‌‌‌‌ సింఘ్వీ మాట్లాడుతూ ఎన్సీఈఆర్టీ ఎంపిక చేసిన విధానం పూర్తి వివక్షతో కూడుకున్నదని అన్నారు. బ్యూరోక్రసీ, రాజకీయాల్లో అవినీతి, ప్రజా సేవలు, దర్యాప్తు సంస్థల్లో అవినీతి సంగతేంటి మరి అని ప్రశ్నించారు. జస్టిస్‌‌‌‌‌‌‌‌ బాగ్చీ స్పందిస్తూ.. పాఠ్యపుస్తకంలో రాజ్యాంగ సమగ్రత లోపించిందని పేర్కొన్నారు.