- ఆలిండియా పోలీస్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖకు ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో పిల్లల అక్రమ రవాణా అతిపెద్ద సమస్యగా మారిందని, ఈ అంశాన్ని ఎవరూ గుర్తించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు తాజాగా పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జి.గణేషన్ వర్సెస్ తమిళనాడు స్టేట్ కేసులో తాజాగా జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్.మహదేవన్ తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది.
తప్పిపోయిన పిల్లలకు సంబంధించిన కేసుల్లో ఏదైనా సమాచారం అందినట్లయితే ప్రాథమిక విచారణ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ విచారణ ప్రక్రియను ప్రారంభించమని కోరకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే, పిల్లల కిడ్నాప్‌కు సంబంధించి భారతీయ న్యాయ సంహితలోని నిబంధనలను ఎఫ్ఐఆర్ లో తప్పనిసరిగా పొందుపర్చాలని పేర్కొంది. అంతేకాకుండా తప్పిపోయిన పిల్లల ఆచూకీ నాలుగు నెలలపాటు తెలియకపోతేనే యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ కు బదిలీ చేయాలన్న ప్రస్తుతం చట్టాలను పక్కన పెట్టాలని సూచించింది. ప్రధానంగా హ్యుమెన్ ట్రాఫికింగ్, తప్పిపోయిన పిల్లలు, మహిళల విషయంలో కోసం ఒక ప్రత్యేక పోర్టల్ తో కూడిన ఆలిండియా పోలీస్ గ్రిన్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది.
కేసు వివరాలు..
తన కూతురు(మైనర్) అదృశ్యమైందని చెన్నైకి చెందిన జి.గణేశ్ 2011లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసినప్పటికీ ఆ బాలిక ఆచూకీ లభించలేదు. చేసేదేమీ లేక పోలీసులు ఈ కేసును క్లోజ్ చేశారు. దీనిపై గణేశ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఈ ముగింపు రిపోర్ట్ లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా వెలుగులోకి వస్తున్న పలు వ్యవస్థాగత సమస్యలను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం.. దేశవ్యాప్తంగా తప్పిపోయిన పిల్లలు, చిన్నారుల అక్రమ రవాణాపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ దిశలో చైల్డ్ ట్రాఫికింగ్ ను ఎదుర్కోవడానికి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.
