స్థానికత విషయంలో నాలుగేండ్ల నిబంధన తప్పనిసరి ..రాష్ట్రపతి ఉత్తర్వులను పాటించాల్సిందే: సుప్రీంకోర్టు

స్థానికత విషయంలో నాలుగేండ్ల నిబంధన తప్పనిసరి ..రాష్ట్రపతి ఉత్తర్వులను పాటించాల్సిందే: సుప్రీంకోర్టు
  • తెలంగాణ జీవోను సవాల్ చేస్తూ జెల్ల అంకిత దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ స్థానికత అంశంపై సుప్రీంకోర్టు మరోసారి స్పష్టత ఇచ్చింది. రిజర్వేషన్ పొందాలంటే నాలుగేండ్ల రూల్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఒక జీవో తెచ్చింది. దీని ప్రకారం.. ఒక విద్యార్థి స్థానిక కోటా కింద సీటు పొందాలంటే, నీట్ అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేండ్లు తెలంగాణలో చదువుకొని ఉండాలనే నిబంధన చేర్చింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ  జీవోను సవాల్ చేస్తూ..  జెల్ల అంకిత అనే విద్యార్థిని ఈ నెల 20న సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. 

దీనిని సోమవారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. విద్యార్థిని తెలంగాణలో జన్మించిందని, టెన్త్​ వరకు అక్కడే చదువుకుందని వివరించారు.  స్టూడెంట్  పేరెంట్స్​ ,  తాతయ్య సైతం తెలంగాణకే చెందిన వారని తెలిపారు. అయితే.. ఉన్నత చదువుల కోసం రెండేండ్లు ఏపీలో విద్యనభ్యసించిందని నివేదించారు. ఈ ఒక్క కారణంతో విద్యార్థినికి స్థానిక రిజర్వేషన్లు నిరాకరించడం సరికాదని వాదించారు.

 వీటిపై జస్సిస్ నరసింహ స్పందిస్తూ... ఇది విభిన్నమైన కేసని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జీవోలు జారీ చేసిందని, వాటి ప్రకారమే ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కోర్టు గుర్తు చేసింది. స్థానికతపై తెలంగాణ ప్రభుత్వ జీవోను సమర్థిస్తూ.. పిటిషన్‌‌‌‌ కొట్టివేస్తున్నట్టు వెల్లడించింది.