పెండ్లి అయిన కుమార్తె కూడా.. కారుణ్య నియామకానికి అర్హురాలే: సుప్రీంకోర్టు కీలక తీర్పు

పెండ్లి అయిన కుమార్తె కూడా.. కారుణ్య నియామకానికి అర్హురాలే: సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: కారుణ్య నియామకాల్లో వివాహిత కుమార్తె లను మినహాయించలేరని, అలా చేయడం అసమంజసం, రాజ్యాంగబద్ధంకాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కారుణ్య నియామకం నిబంధనలకు సంబంధించి ‘‘కుటుంబం’’ అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె ఉండదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఈమేరకు సుప్రీం జడ్జిలు జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ అలోక్ అరాధేతో కూడిన బెంచ్ మంగళవారం తోసిపుచ్చింది. యూపీకి చెందిన ఒక రేషన్ డీలర్ చనిపోగా, కారుణ్య నియామకం కింద డీలర్​షిప్ తనకు ఇవ్వాలన్న మృతుడి కుమార్తె (వివాహిత) విజ్ఞప్తిని అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంలో అప్పీల్ చేయగా, తాజాగా తీర్పు వెలువడింది.

 ‘‘కుటుంబం’’ నిర్వచనం నుంచి వివాహిత కుమార్తెలను మినహాయించిన 2019 నాటి ప్రభుత్వ ఉత్తర్వును ఆ మహిళ సవాల్ చేసింది. దీనిపై విచారించిన సుప్రీం బెంచ్.. మరణించిన డీలర్ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి తక్షణ ఉపశమనం అందించడమే డిపెండెంట్ కోటా కింద కేటాయింపు ముఖ్య ఉద్దేశం కాబట్టి, కుటుంబ నిర్వచనం నుంచి వివాహిత కుమార్తెను మినహాయించడాన్ని సమర్థించలేమని స్పష్టం చేసింది. 

‘‘ఆధారపడటం, ఆర్థిక అవసరం, నివాసం, డీలర్‌‌‌‌షిప్‌‌‌‌కు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించే దరఖాస్తుదారు సామర్థ్యం అనేవి ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు. వైవాహిక స్థితికి ఈ అంశాలతో ఎలాంటి హేతుబద్ధమైన సంబంధంలేదు’’ అని బెంచ్​ తెలిపింది. వివాహం కాగానే కుమార్తె తన తల్లిదండ్రుల ఫ్యామిలీలో సభ్యురాలిగా, వారిపై ఆధారపడే వ్యక్తిగా ఉండటం మానేస్తుందనే ఊహతోనే ఈ వివాదాస్పద రూల్​ ఉందని, అటువంటి ఊహ రాజ్యాంగబద్ధంగా అనుమతించదగినది కాదని పేర్కొంది.