జింఖానాను పరిశీలించిన  సుప్రీంకోర్టు సూపర్‌వైజరీ కమిటీ 

జింఖానాను పరిశీలించిన  సుప్రీంకోర్టు సూపర్‌వైజరీ కమిటీ 

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) కార్యకలాపాల పర్యవేక్షణకు సుప్రీంకోర్టు నియమించిన సూపర్‌వైజరీ కమిటీ జింఖానా గ్రౌండ్ ను పరిశీలించింది. ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు జింఖానా గ్రౌండ్స్ లోని కోచింగ్ సదుపాయాలను తనిఖీ చేశారు. తెలంగాణలోని గ్రామీణ ప్రతిభను వెలికితీసే దిశగా కమిటీ చర్యలు చేపట్టనుంది. దీపావళి పండుగ తర్వాత జింఖానా గ్రౌండ్స్ లో స్పెషల్ కోచింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కోచింగ్ కు వచ్చే ఆటగాళ్లకు ఉప్పల్ స్టేడియంలోనే వసతి ఏర్పాట్లు కూడా చేయాలని యోచిస్తు్న్నారు. ఈనెల 15న ఉప్పల్ స్టేడియంలో మరోసారి కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పాలనా వ్యవహారాలు సరిగ్గా జరిగేలా చూడాలని నిర్దేశిస్తూ ఈ ఏడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టు నలుగురు సభ్యులతో కూడిన సూపర్ వైజరీ ప్యానల్ ను నియమించింది. హెచ్సీఏలో జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య పాలనా వ్యవహారాలు సక్రమంగా జరిగేలా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సూపర్ వైజరీ ప్యానల్ లో  ఏపీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కక్రు, తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్, భారత జట్టు మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు, హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ వంకా ప్రతాప్ ఉన్నారు.