2018 గద్వాల ఎన్నికపై ఆగస్టు 6న తీర్పు

2018 గద్వాల ఎన్నికపై ఆగస్టు 6న తీర్పు
  • వాయిదా వేసిన సుప్రీంకోర్టు
  • ఎమ్మెల్యేగా కృష్ణమోహన్​రెడ్డి ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గతంలో స్టే 

న్యూఢిల్లీ, వెలుగు: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు పత్రాలు సమర్పించారని, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని ప్రస్తుత బీజేపీ ఎంపీ డీకే.అరుణ దాఖలు చేసిన పిటిషన్ పై ఆగస్టు 6న తుది తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2018 ఎన్నికల్లో గద్వాల నుంచి కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే.అరుణ 28 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అయితే, కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని డీకే.అరుణ  తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతుండగానే ఆమె బీజేపీలో చేరారు. మరోవైపు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. ఎన్నికల్లో ఆయన తర్వాత రెండో స్థానంలో నిలిచిన అరుణను 2018 డిసెంబర్ 12 నుంచి ఎమ్మెల్యేగా పరిగణించాలని ఆదేశించింది.

తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కృష్ణమోహన్ రెడ్డికి రూ.2.5 లక్షల జరిమానా విధించింది. మరో రూ.50 వేలను పిటిషనర్ కు పరిహారంగా చెల్లించాలని పేర్కొంది. అయితే, హైకోర్టు తీర్పును 31 ఆగస్టు 2023న కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అదే ఏడాది సెప్టెంబర్ 11న హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. అనంతరం పలుమార్లు ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. గురువారం జస్టిస్ బీవీ.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట మరోసారి విచారణకు వచ్చింది.

పిటిషన్ విచారణ సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉందని కృష్ణమోహన్ రెడ్డి తరఫు అడ్వొకేట్ మోహిత్ రావు తెలిపారు. అప్పటి ఎన్నికకు సంబంధించి పదవీకాలం ముగిసిందని పేర్కొన్నారు. ఈ కేసులో తుది వాదనలకు అవకాశం కల్పించాలని కోరగా.. ధర్మాసనం ఆగస్టు 6న తుదితీర్పు వెల్లడిస్తామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.