- మూలన పడ్డ యంత్రాలు.. అస్తవ్యస్తంగా ఆస్పత్రి నిర్వహణ
- అర్హతలేని వారితో టెస్టులు... రోగుల ప్రాణాలతో చెలగాటం
- ఆస్పత్రిలో కిట్ల కొరత.. పేషెంట్లు ప్రైవేటు బాట పట్టాల్సిన పరిస్థితి
- సెలవులో సూపరింటెండెంట్.. ఇష్టారాజ్యంగా సిబ్బంది తీరు!
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రి అస్తవ్యస్త నిర్వహణతో సమస్యల నిలయంగా మారింది. ప్రభుత్వం పేదల ఆరోగ్యం కోసం రూ.కోట్లు ఖర్చు చేసి అత్యాధునిక మిషన్లు కొనుగోలు చేస్తున్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి నిరుపయోగంగా పక్కకు పడి ఉన్నాయి. 2డి ఎకో మిషన్లు ఏండ్లుగా మూలన పడడం, ఎలక్ట్రోలైట్స్ 9 నెలలుగా అందుబాటులో లేకపోవడం, సెంట్రల్ ల్యాబ్‌లో పరీక్షలు నిలిచిపోవడంతో రోగుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. మరోవైపు ఆస్పత్రి సూపరింటెండెంట్ సెలవులో ఉంటూ హైదరాబాద్‌లోని ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో డాక్టర్లు సమయానికి రాక, హాస్పిటల్ నిర్వహణ సక్రమంగా లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.
రోజుకు కేవలం 39 లోపే స్కాన్లు..
ఆస్పత్రికి వస్తున్న వందలాది మంది రోగుల్లో కేవలం 30 నుంచి 39 మందికి మాత్రమే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తున్నారు. దీంతో చాలా మంది పేషెంట్లు పరీక్షలు చేయించుకోకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో స్కానింగ్ ఖర్చులు భరించలేక ఎంతో దూరం నుంచి ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయించి, పొద్దున 7 గంటల నుంచి క్యూలో ఉంటే 30 మందికే పరీక్షలు చేస్తున్నారు.
మూలన పడ్డ యంత్రాలు..
డయాలసిస్ రోగులకు అత్యంత అవసరమైన ఎలక్ట్రోలైట్స్ తొమ్మిది నెలలుగా అందుబాటులో లేవు. దీంతో గత్యంతరం లేక రోగులు బయట నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. హెచ్ఐవీ పరీక్షలకు సంబంధించిన కంపైడ్ కిట్స్ లేక ‘ఆల్పెన్’ కిట్లతో సరిపెడుతున్నారు. 2డి ఎకో మిషన్లు మూడు ఏండ్లుగా పక్కకు పెట్టడంతో అవి నిరుపయోగంగా మారాయి. దీంతో గుండె సంబంధిత పరీక్షల కోసం వచ్చే రోగులు ప్రైవేటు సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. సెంట్రల్ ల్యాబ్‌లో యాసిడ్ బేసిక్ బ్యాలెన్స్ లేక మూడు నెలలుగా పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో టెస్టుల రిపోర్ట్ కోసం పేషెంట్లు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు.
ల్యాబ్ టెక్నీషియన్ తో సిటీ స్కాన్ పరీక్షలు !
సిటీ స్కాన్ పరీక్షలను రేడియాలజిస్ట్ పర్యవేక్షణలో చేయాల్సి ఉండగా, కేవలం ల్యాబ్ టెక్నీషియన్లతో స్కాన్లు తీయిస్తుండటం రోగుల ప్రాణాల మీదకు తెచ్చేలా ఉంది. రేడియాలజిస్టుల కొరత, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం సమస్యగా మారింది. కాగా, ఆస్పత్రి సూపరింటెండెంట్ నెల రోజులుగా సెలవులో ఉన్నారు. ఆర్ఎంఓ స్థాయి అధికారికి బాధ్యతలు ఇవ్వాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో కొంత మంది డాక్టర్లు డ్యూటీలకు డుమ్మా కొట్టి జూనియర్ డాక్టర్లు, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయిస్తున్నారు.
-నియామకాల్లో జాప్యం
ఏఆర్టీ సెంటర్ లో హెచ్ఐవీ సంబంధిత మెడికల్ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ అవుట్ సోర్స్ పోస్టులకు ప్రభుత్వం గత నెల 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా స్థాయిలో సూపరింటెండెంట్ నియమాకలను చేపట్టాలని ఉత్తర్వులో పేర్కొంది. కానీ ఇక్కడ సూపరింటెండెంట్ సెలవులో ఉండడంతో నెల రోజులుగా భర్తీ చేయలేదు. నేటికీ జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో కేటాయించిన రెండు పోస్టులు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
బడ్జెట్ ప్రపోజల్ పంపించాం
జనరల్ హాస్పిటల్ లో సదుపాయాల కోసం ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించాం. హాస్పిటల్ లో ఎక్స్ రే మిషన్ ఫిల్మ్ లేకపోవడంతో మిషన్లు పక్కకు పెట్టాం. 2డి ఎకో మిషన్ బ్యాటరీలు చెడిపోవడం, టెక్నీషియన్ లేకపోవడంతో వినియోగించడం లేదు. త్వరలో కొత్త భవనం ప్రారంభం కాగానే మిషన్లను వినియోగంలోకి తీసుకొస్తాం. ఏఆర్టీ సెంటర్ లో నియామకాలు డీఎంహెచ్ఓ చేపట్టాల్సి ఉండడంతో ప్రక్రియ ఆలస్యమైంది.
-డాక్టర్ ఉపేందర్, ఆర్ఏంఓ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, సూర్యాపేట
