కారు బోల్తా పడి ఇద్దరు మృతి....సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద ప్రమాదం

కారు బోల్తా పడి ఇద్దరు మృతి....సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద ప్రమాదం
  • మరో ఇద్దరికి తీవ్రగాయాలు

 

మునగాల, వెలుగు : కారు బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల శివారులో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అనంతగిరి మండలం మొగలాయికోటకు చెందిన కిన్నెర దావీదు (35), కొండ్రు వంశీ (34) హైదరాబాద్‌‌లో ఉంటున్నారు. స్వగ్రామంలో బంధువు చనిపోవడంతో మరో ఇద్దరితో కలిసి కారులో హైదరాబాద్‌‌ నుంచి స్వగ్రామం వస్తున్నారు. మార్గమధ్యలో ఆకుపాముల శివారులోకి రాగానే కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది.

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని కారు డోర్లను పగులగొట్టి నలుగురిని బయటకు తీశారు. దావీదు అక్కడికక్కడే చనిపోగా.. హాస్పిటల్స్‌‌కు తరలిస్తుండగా వంశీ చనిపోయాడు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం తరలించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ నర్సింహ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై ప్రవీణ్‌‌కుమార్‌‌ ఉన్నారు.